న్యూఢిల్లీ: భూకంపం, సునామీ తాకిడి వల్ల అల్లకల్లోలం అయిన ఇండోనేషియాలో ‘పాలూ’ నగరాన్ని ఆదుకునేందుకు భారత్ ముందుకు వచ్చింది. ఇండోనేషియా ప్రజలకు అత్యవసరమైన మందులను, ఆహార పదార్థాలను భారత నౌకదళానికి చెందిన మూడు ఓడల్లో ఇండోనేషియాకు పంపించింది. భారత నౌకాదళానికి చెందిన సుజాత, తిర్, సర్దూల్ నౌకలు ఈ సహాయక సామగ్రిని మోసుకొని ‘పాలూ’ నగరానికి బయలుదేరినట్లు నౌకదళ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
దీంతోపాటు వాయుదళానికి చెందిన సీ17, సీ130 జే, ఐఏఎఫ్ విమానాలు కూడా రిలీఫ్ మెటీరియల్‌ను ఇండోనేషియాకు తీసుకెళ్తున్నాయి. వాటిలో 16 టన్నుల మందులు, జనరేటర్లు, 15.66 టన్నుల టెంట్లు, అలాగే చెన్నై నుంచి ఐఏఎఫ్ విమానాలలో 700 కిలోల బిస్కెట్లు, 500 లీటర్ల పాలు, ఇండోనేషియాకి పంపిస్తున్నట్లు జాతీయ విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు.
చదవండి: మరోసారి ఇండోనేషియాను వణికించిన భూకంపం….
మరోవైపు భూకంపం-సునామీ కారణంగా ఇప్పటి వరకు 1,234 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇండోనేషియా ప్రకటించింది. రహదారులపై ఎక్కడ చూసినా మృతదేహాలతో, కుప్పకూలిపోయిన ఇళ్లతో అక్కడి వాతావరణం ఎంతో భీతావహంగా మారింది. భూకంపం సంభవించి నాలుగు రోజులు గడిచినప్పటికీ అక్కడి పరిస్థితుల్లో మార్పు రాలేదు.
ఇండోనేషియాలో నెలకొన్న పరిస్థితుల గురించి ప్రధాని మోడి ప్రత్యేకంగా ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడోకి ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. మోడీ ఫోన్ చేసిన కొన్ని గంటల అనంతరం ఈ రిలీఫ్ మెటీరియల్ ఇండోనేషియాకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు చాలా అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి.