
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విస్తరణ ఏమాత్రం తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 4,970 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయంటే.. పరిస్థితి ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది.
ఈ మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా 134 మంది మరణించగా, ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 3,163కు చేరుకుంది.
మంగళవారం నాటికి దేశంలో మొత్తం కారోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షను దాటిపోయింది. బాధితుల్లో ఇప్పటి వరకు 39,174 మంది దేశంలోని వివిధ ఆసుపత్రుల్లో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
కరోనా బారిన పడిన మరో 58,802 మంది ఇంకా వివిధ ఆసుపత్రుల్లో వివిధ స్థాయిల్లో చికిత్స పొందుతున్నారు. ఒక్క మహారాష్ట్రలోనే ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35 వేలు దాటగా, 1,249 మంది మరణించారు.
తెలుగు రాష్ట్రాల్లో…
ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోనూ కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 57 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇటు తెలంగాణలోనూ కేసులు నమోదు అయ్యాయి.
మొత్తం కేసుల విషయానికొస్తే.. మంగళవారం నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 2,339 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఇటు తెలంగాణలోనూ కేసుల సంఖ్య 1,592కు పెరిగింది.
ఏపీలో గత 24 గంటల్లో చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు కరోనా రోగులు మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం మృతుల సంఖ్య 52కు చేరింది.
ఇక తెలంగాణలోనూ మంగళవారం నాటికి కరోనా మృతుల సంఖ్య 34కు చేరుకున్నట్లు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం ఏపీలోని వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో ఇంకా 691 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటి వరకు కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు 1,596 మంది.
అలాగే తెలంగాణలోనూ వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 556 మంది చికిత్స పొందుతుండగా, కరోనా నుంచి కోలుకుని 1,002 మంది డిశ్చార్జ్ అయ్యారు.








