25 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం సర్జికల్ స్ట్రయిక్స్ 2.0: సత్తా చాటిన మిరేజ్ 2000 జెట్ ఫైటర్స్! కార్గిల్ యుద్ధంలోనూ జైత్రయాత్ర…

సర్జికల్ స్ట్రయిక్స్ 2.0: సత్తా చాటిన మిరేజ్ 2000 జెట్ ఫైటర్స్! కార్గిల్ యుద్ధంలోనూ జైత్రయాత్ర…

iaf-mirage-2000-fighter-jet-1, newsxpress.online
- Advertisement -

iaf-mirage-2000-fighter-jet-1, newsxpress.online

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రవాద దాడులకు భారత్ అదను చూసి ప్రతీకారం తీర్చుకుంది. కన్నుమూసి తెరిచేలోగా భారత వైమానికి దళం జెట్ ఫైటర్లు సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించి దిగ్విజయంగా వెనుదిరిగాయి. భారత అనూహ్య వైమానిక దాడితో పాకిస్తాన్ ఉలిక్కిపడింది.. ఉక్కిరిబిక్కిరి అయింది.

మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో భారత వైమానికి దళానికి చెందిన మిరేజ్ 2000 జెట్ ఫైటర్లు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు చెందిన శిబిరాలపై ఈ మెరుపుదాడి జరిపాయి. ఈ దాడిలో పాల్గొన్న జెట్ ఫైటర్లు 1000 కిలోల బాంబులను మోసుకెళ్లి ఉగ్రవాద శిబిరాలపై జార విడవడంతో అవి నామరూపాలు లేకుండా నాశనమయ్యాయి.

పనిలోపనిగా మిరేజ్ 2000 జెట్ ఫైటర్లు పాక్ భూభాగంలోనూ బాంబుల వర్షం కురిపించి విజయగర్వంతో వెనుదిరిగాయి.  ప్రధాని మోడీ ఆదేశాలతో పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రయిక్స్-2కు దిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు ఇందుకు తన అంబుల పొదిలోని మిరేజ్ 2000 జెట్ ఫైటర్లను రంగంలోకి దించారు. గతంలో కార్గిల్ యుద్ధ సమయంలోనూ భారత్ విజయంలో ఈ జెట్ ఫైటర్లు కీలక పాత్ర పోషించాయి.

ఈ నేపథ్యంలో మిరేజ్ 2000 జెట్ ఫైటర్ల శక్తిసామర్థ్యాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. దేశం యావత్తు ఈ యుద్ధ విమానాలు, వాటిని నడిపిన పైలట్లపై ప్రశంసలు కురిపిస్తోంది. విపక్ష నాయకులు సైతం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సాహసానికి సెల్యూట్ చెబుతున్నారు.

ఏమిటీ మిరేజ్ 2000 జెట్ ఫైటర్స్…

భారత వైమానిక దళానికి చెందిన మిరేజ్ 2000 జెట్ ఫైటర్లు అత్యంత శక్తిమంతమైనవి. ఇవి ఎయిర్ టు ఎయిర్.. అంటే ఆకాశం నుంచి ఆకాశం లోకి బాంబుల్ని ప్రయోగించగలవు. మైకా మల్టీ టార్గెట్ ఎయిర్ టు ఎయిర్ ఇంటర్‌సెప్ట్, క్షిపణులు, మ్యాజిక్ 2 క్షిపణులను ఇవి మోసుకెళ్లగలవు. వీటిని ఫ్రెంచ్ కంపెనీ అయిన దసాల్ట్ ఏవియేషన్ తయారు చేసి భారత్‌కు విక్రయించింది.

శతృ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించడంలో ఈ యుద్ధ విమానాలు కీలకంగా వ్యవహరిస్తాయి. ఇవి సింగిల్ ఇంజన్ కలిగిన ఫోర్త్ జనరేషన్ జెట్ ఫైటర్లు.

డిజిటల్ వెపన్ డెలివరీ నావిగేషన్ సిస్టమ్…

మిరేజ్ 2000 జెట్ ఫైటర్లు గంటకు 2,530 కిలోమీటర్ల వేగంతో దూసుకెళతాయి. వీటిలో డిజిటల్ వెపన్ డెలివరీ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది. దీని ద్వారా రాత్రీ పగలు లేజర్‌-గైడెడ్ వెపన్స్ ఫైర్ చేయవచ్చు. ఒక్కో యుద్ధ విమానం నిమిషానికి 1,200 నుంచి 1,800 రౌండ్లు మిస్సైల్స్‌ను ఫైర్ చేస్తుంది.

ఈ మిరేజ్ యుద్ధ విమానాల్లో చాలా రకాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత వైమానిక దళం వద్ద ఉన్నవి 2000H, 2000TH మోడల్ యుద్ధ విమానాలు.  తాజాగా సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన మెరుపు దాడుల్లో మొత్తం 12 మిరేజ్ 2000 జెట్ ఫైటర్లు పాల్గొన్నాయి.

కార్గిల్ యుద్ధం తర్వాత భారత వైమానిక దళం మళ్లీ దాడులు చేయడం ఇదే తొలిసారి. ప్రధాని మోడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ క్షణాల్లో ఉగ్రవాద స్థావరాలను తుడిచిపెట్టింది. మొత్తానికి కార్గిల్ యుద్ధంలో భారత్‌కు విజయం అందించిన మిరేజ్ 2000 యుద్ధ విమానాలు మళ్లీ ఈ ఆపరేషన్‌లో తమ సత్తా చాటి ప్రతి భారతీయుడు గర్వపడేలా చేశాయి.

సంబంధిత వార్తలు

- Advertisement -