

శ్రీనగర్: కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో బుధవారం ఉదయం భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం ఒకటి కూలిపోయింది. ఈ ఘటనలో ఆ విమాన పైలట్, కో-పైలట్ అక్కడికక్కడే మరణించారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు కూడా ధ్రువీకరించారు. యుద్ధవిమానం కూలడంతో ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించాయి.
అవంతిపుర ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన ఈ యుద్ధ విమానం బుద్గాంలో కూలినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన రొటీన్ సైనిక విన్యాసాల్లో భాగంగా జరిగిందా? లేక యుద్ధ సన్నాహక చర్యల్లో భాగంగా జరిగిందా? అనే దానిపై స్పష్టత రాలేదు. మరోవైపు యుద్ధ విమానం ఎలా కూలిందనే విషయమై వాయుసేన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
పుల్వామా ఉగ్రదాడికి ప్రతిగా భారత్ మంగళవారం తెల్లవారుజామున సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న జైషే మహ్మద్ స్థావరాలపై మిరేజ్ 2000 జెట్ ఫైటర్లతో విరుచుకుపడి.. 1000 కిలోల బాంబులతో ఆ స్థావరాలను సమూలంగా ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.
పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ కూల్చివేసిందా?
తమ భూభాగంలోకి భారత యుద్ధ విమానాలు ప్రవేశించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పాకిస్తాన్ ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో బుధవారం ఉదయం మన మిగ్ యుద్ధ విమానం కూలిపోయిన ఘటనలో పాకిస్తాన్ ప్రమేయం ఉందా? అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు భారత్‌కు చెందిన యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ యుద్ధ విమానాలు కూల్చేశాయంటూ పాకిస్తాన్ మీడియా కూడా కోడై కూస్తోంది. అంతేకాదు, ఒకటి కాదు.. తాము రెండు యుద్ధ విమానాలను కూల్చేశామని ప్రకటించడమేకాక ఓ భారత పైలట్‌ను అరెస్ట్ చేసినట్లు కూడా చెబుతోంది. అయితే పాకిస్తాన్ మీడియా వ్యాఖ్యలను భారత్ తోసిపుచ్చుతోంది.
#SpotVisuals: Police on military aircraft crash in Jammu & Kashmir’s Budgam, say, “Two bodies have been found at the crash site.” pic.twitter.com/Tg2uFeJjdW
— ANI (@ANI) February 27, 2019








