22.6 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం ముంబైలో రెడ్ అలర్ట్! విమానాలు, రైళ్లు రద్దు.. మరో 24 గంటలు ఇంతే…

ముంబైలో రెడ్ అలర్ట్! విమానాలు, రైళ్లు రద్దు.. మరో 24 గంటలు ఇంతే…

mumbai-heavy-rains
- Advertisement -

ముంబై: వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన ముంబైతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కుండపోత కారణంగా వరద ముంచెత్తుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు.. గురువారం ఉదయం రెడ్ అలర్ట్ ప్రకటించారు.

మరోవైపు గురువారం ముంబైతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గురువారం ఉదయం రెడ్ అలర్ట్ ప్రకటించడంతో ముంబై వాసులు భయాందోళనలకు గురయ్యారు. వివిధ శాఖల అధికారులు కూడా అప్రమత్తమై ముందస్తు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

జనజీవనం అస్తవ్యస్థం…

ఇక మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో జన జీవనం స్తంభించి పోయింది. వాణిజ్య రాజధాని ముంబైలో అయితే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వరుసగా కురుస్తున్న వర్షాలతో ముంబై అస్తవ్యస్థంగా మారింది.

ముంబై, పాల్ఘర్, రాయ్‌గఢ్, థానే లాంటి ప్రాంతాల్లో రాబోయే ఇరవై నాలుగు గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

స్కూళ్లు, కాలేజీలకు సెలవులు…

ఈ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు విద్యాశాఖ అధికారులు సెలవులు ప్రకటించారు. ముంబైలో భారీ వర్షాల కారణంగా దాదాపు 2 కోట్ల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వాహనాల రాకపోకలకూ తీవ్ర అంతరాయం కలుగుతోంది.

మరోవైపు వర్షాలు, వరదల కారణంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పాల్ఘర్‌ జిల్లాలో ఆరేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. విద్యుత్తు సరఫరా నిలిచి పోవడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు చీకట్లో మగ్గుతూ నానా అవస్థలు పడుతున్నారు.

పలు రైళ్లు, విమానాలు రద్దు…

భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేయగా.. సబర్బన్ సర్వీసులు కూడా ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. దాదాపు 30 విమానాల రాకపోకలు రద్దుకాగా, 118 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు సమాచారం.

- Advertisement -