

పంచకుల: వివాదాస్పద వాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న బీజేపీ నేతల జాబితాలో.. కొత్తగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేరారు. మహిళలపై జరిగే అత్యాచారాలకు సంబంధించి ఈయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇరుక్కుపోయారు. ఎక్కడో నాలుగు గోడల మధ్య కాదు.. ఏకంగా రోడ్ షోలోనే సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఈ తరహా విమర్శలు చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
హర్యానాలోని పంచకుల జిల్లా కల్కా పట్టణంలో శనివారం సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఈ కామెంట్లు చేశారు. రేప్‌లు గతంలోనూ జరిగాయని, ఇప్పుడూ జరుగుతున్నాయని.. చిన్న తేడా ఏంటంటే కాస్త నంబర్ మాత్రమే పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. విషయాన్ని ఏమాత్రం సీరియస్ గా తీసుకోనట్టు అనిపించిన ఆయన వాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి.
సీఎంగా ఉన్న వ్యక్తి ఆలోచనలే ఇలా ఉంటే, ఇక రాష్ట్రంలో మహిళలకు భద్రత ఎక్కడిదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మనోహర్ లాల్ మహిళా వ్యతిరేకి అని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా ఆయనపై మండిపడుతున్నారు. మహిళలను ఉద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ఆ సీఎం అంతే, గతంలోనూ….
అంతేకాదు, గతంలో కూడా హర్యానా సీఎం ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. రేప్ కేసులు పెరగడానికి కారణం మహిళల దుస్తులే అంటూ ఆయన కామెంట్ చేయడంపై గతంలో పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.








