29.2 C
Hyderabad
Saturday, August 29, 2026
- Advertisement -
Home వాణిజ్యం కార్పొరేట్ అనిల్ అంబానీకి షాక్! నెల రోజుల్లో రూ.453 కోట్లు కట్టకపోతే జైలుకే: సుప్రీం వార్నింగ్…

అనిల్ అంబానీకి షాక్! నెల రోజుల్లో రూ.453 కోట్లు కట్టకపోతే జైలుకే: సుప్రీం వార్నింగ్…

anil-ambani-held-guilty-of-contempt-says-supreme-court, newsxpress.online
- Advertisement -

న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్ కామ్) అధినేత అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు బుధవారం షాక్ ఇచ్చింది. తమ ఆదేశాల పట్ల నిర్లిప్త వైఖరి అవలంబించి అనిల్ అంబానీతోపాటు ఆ కంపెనీకి చెందిన మరో ఇద్దరు డైరెక్టర్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని నిర్ధారిస్తూ.. నెల రోజుల్లో రూ.453 కోట్లు చెల్లించాలని, లేనిపక్షంలో 3 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తేల్చింది.

అంతేకాదు, సుప్రీంకోర్టు న్యాయ సహాయ విభాగానికి అనిల్ అంబానీకి చెందిన మూడు కంపెనీలు రూ.కోటి చొప్పున నాలుగు వారాల్లో చెల్లించాలని, లేకుంటే నెల రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని కూడా ఆదేశించింది. అంతకుముందు రిలయన్స్ కమ్యూనికేషన్స్ పూచీకత్తుగా పెట్టిన రూ.118 కోట్లను తిరిగి ఆ కంపెనీకి ఇచ్చేయాలంటూ సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సూచించింది.

అసలేం జరిగిందంటే…

ఎరిక్సన్ కంపెనీకి రూ.550 కోట్లు చెల్లించాలంటూ గతంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మొత్తం చెల్లించేందుకు 120 రోజుల గడువు కూడా విధించింది. అయితే ఆర్ కామ్ కంపెనీ గడువులోగా ఆ డబ్బును చెల్లించలేకపోయింది. దీంతో అదనంగా మరో 60 రోజులు సుప్రీంకోర్టు గడువుగా ఇచ్చింది. అయినా సరే ఇచ్చిన గడువులోగా అనిల్ అంబానీ కంపెనీ డబ్బు చెల్లించలేకపోయింది.

దీంతో బుధవారం ఈ కేసు విచారణకు రాగా, సర్వోన్నత న్యాయస్థానం అనిల్ అంబానీపై మండిపడింది. అసలు డబ్బు చెల్లిస్తామంటూ తమకు ఇచ్చిన పూచీకత్తు కూడా అబద్ధమని అభిప్రాయపడింది. ఇది న్యాయ పాలనకు విఘాతం కలిగించడమేనని, సుప్రీంకోర్టుకు అబద్ధపు హామీ ఇచ్చిడం కూడా కోర్టు నిబంధనలను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది.

ఈ విషయంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ క్షమాపణ చెప్పినా కూడా సుప్రీంకోర్టు దానిని తోసిపుచ్చుతూ తాజా ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల్లో రూ.453 కోట్లు చెల్లించాలని, లేనిపక్షంలో జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది.

అసలే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఉన్న అనిల్ అంబానీ ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా సమకూర్చుతారన్నది అందరి మదిలోనూ నానుతున్న ప్రశ్న. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే అనిల్‌కు అన్న ముకేశ్ అంబానీయే శరణమా?

- Advertisement -