

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించిన కారణంగా సీబీఐ తాత్కాలిక మాజీ అధిపతి ఎం నాగేశ్వరరావుకు అత్యున్నత న్యాయస్థానం మంగళవారం శిక్షను విధించింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలో ఏర్పడిన ధర్మాసనం.. నాగేశ్వరరావుకు రూ. లక్ష జరిమానాను కూడా విధించింది.
ముజఫర్‌పుర్ వసతిగృహం అత్యాచారాల కేసు దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న అధికారి ఏకే శర్మను తమ అనుమతి లేకుండా సీబీఐ బదిలీ చేయడంపై ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. మంగళవారం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టింది. కోర్టు ధిక్కరణకు పాల్పడటంపై నాగేశ్వరరావుతోపాటు అడిషనల్ లీగల్ అడ్వయిజర్ భసురణ్‌లకు శిక్ష వేసింది.
చదవండి: మిమ్మల్ని దేవుడే కాపాడాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావుపై.. సుప్రీం తీవ్ర ఆగ్రహం!
‘మేం చెప్పేవరకు మీరిద్దరు కోర్టులో ఏదో ఒక మూలకు పోయి కూర్చోండి’ అని జస్టిస్ రంజన్ గొగొయ్ నాగేశ్వరరావు, భసురణ్‌లను ఆదేశించింది. దీంతో వారిద్దరూ కోర్టు రూమ్ నెం.1లో కూర్చున్నారు. ఈ రోజంతా(కోర్టు కార్యకలాపాలు ముగిసేంతవరకు) వారికే ఇదే శిక్ష అని కోర్టు స్పష్టం చేసింది.
అయితే, తాను కోర్టు ధిక్కరణను ఉద్దేశపూర్వకంగా చేయలేదని, తమ తప్పును ఒప్పుకుంటున్నామని నాగేశ్వరరావు తన అఫిడవిట్‌లో కోర్టుకు తెలిపారు. తాను కోర్టు ధిక్కరణకు పాల్పడతానని కలలో కూడా అనుకోలేదని, తమ తప్పును మన్నించాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. నాగేశ్వరరావు తరపున అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదనలు వినిపించారు.
కాగా, నాగేశ్వరరావు వాదనలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఇది కోర్టు ధిక్కారం కాకపోతే మరేంటీ..? దీనికి శిక్ష పడాల్సిందే. నాగేశ్వరరావుకు రూ. లక్ష జరిమానా విధిస్తున్నాం. దీంతో పాటు ఈ రోజంతా మీరు ఇక్కడే ఉండాలి. కోర్టు కార్యకలాపాలు ముగిసేంతవరకు వెళ్లి కోర్టు గదిలో ఓ పక్కన కూర్చోండి’ అని ధర్మాసనం ఆదేశించింది.








