న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ గురువారం భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్రమంత్రి జేపీ నడ్డా సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా రాపోలు ఆనంద భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ.. 25ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడానని చెప్పారు. 15 రోజుల అంతర్మథనం తర్వాత బీజేపీలో చేరినట్లు తెలిపారు. సైద్ధాంతిక విధానం, ప్రాంతీయ భావజాలం లేని కాంగ్రెస్‌లో ఇమడలేకపోయానని చెప్పారు.
బీజేపీలో చేరిక అందుకే..
తెలంగాణ ఆత్మగౌరవం, దేశ సమగ్రత కోసం బీజేపీలో చేరానని రాపోలు ఆనంద భాస్కర్ వివరించారు. గత నెలలోనే కాంగ్రెస్ పార్టీకి రాపోలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి వంటి సీనియర్లు బీజేపీలో చేరారు.
ఓ వైపు పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతుండటం, సీనియర్ నేతలు బీజేపీ బాట పడుతుండటం కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచిన సుమారు 8మందికిపైగా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరడం గమనార్హం.
చదవండి: అసెంబ్లీలో ఏనాడైనా నియోజకవర్గ అభివృద్ధి పై మాట్లాడారా! కొడాలి పై యామిని ఫైర్!








