
ఢిల్లీ: గత గురువారం వెలువడిన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెల్సిందే. ఆ పార్టీ కేవలం 52 స్థానాల్లో గెలిచి కనీసం ప్రతిపక్ష హోదాని కూడా దక్కించుకోలేదు.
అయితే తమ మిత్రపక్షాలని కలుపుకుంటె కాంగ్రెస్‌కి ప్రతిపక్ష హోదా దక్కుతుంది. కానీ ఎన్నికల్లో ఘోరంగా విఫలమవడంపై రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో ఓటమికి నైతిక బాధ్యతని వహిస్తూ…పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
ఈ క్రమంలోనే యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీతో సహ అధిష్టానం దూతలు అహ్మద్‌పటేల్, కేసీ వేణుగోపాల్ సైతం రాహుల్ ను వారించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
దీంతో తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేందుకు ససేమిరా అనడంతో, రాహుల్ నిర్ణయానికి సోనియాగాంధీ, ప్రియాంకా గాంధీ అంగీకరించినట్టు తెలుస్తోంది. తాను మళ్లీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టబోనని, మరొకరిని ఎంపిక చేయాలని రాహుల్ చెబుతున్నట్లు సమాచారం.
అటు కాంగ్రెస్ తరఫున లోక్ సభకు ఎన్నికైన కొత్త ఎంపీలను కలుసుకుని మాట్లాడేందుకు సైతం రాహుల్ నిరాసక్తత కనబరిచినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, పార్టీ కోసం పనిచేస్తానని తన వద్దకు వచ్చిన సీనియర్ నేతలకు రాహుల్ స్పష్టం చేసినట్టు సమాచారం.
అధ్యక్ష పదవిని కుటుంబ సభ్యులకి కాకుండా పార్టీలో ఎవరికొకరికి ఇవ్వాలని రాహుల్ కోరినట్లు సమాచారం.








