అంబిడెంట్ కేసు: మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్, పీఏ అలీఖాన్ కూడా.. రాత్రంతా విచారణ, ఉదయం ఆసుపత్రికి తరలింపు…

gali janardhan is reddy ready to surrender to police
- Advertisement -

gali janardhan is reddy ready to surrender to police

బెంగళూరు: ఊహించినట్లుగానే కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ‘పోంజీ’ స్కాంలో  తాను అరెస్టు కావడం తథ్యమని తెలిసిన గాలి మూడ్రోజుల క్రితం అదృశ్యం కావడం.. ఆయన కోసం పోలీసులు వేట మొదలుపెట్టడం, అటు బెంగళూరుతోపాటు, ఇటు హైదరాబాద్ లోనూ తీవ్రంగా గాలించడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్న గాలి జనార్ధన్ రెడ్డి.. బెయిల్ లభించే అవకాశాలు లేకపోవడంతో.. ఇక లాభం లేదనుకుని శనివారమే పోలీసుల ఎదుట లొంగిపోయారు.  దీంతో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 3 గంటల వరకూ ఆయన్ని విచారించిన బెంగళూరు స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మరోమారు విచారణ మొదలుపెట్టారు.

‘‘రాత్రి బాగా నిద్రపోయారా?’’

శనివారం అంతా సీబీఐ కార్యాలయంలోనే గాలి జనార్ధన్ రెడ్డిని ఉంచి ప్రశ్నించిన అధికారులు.. ఆయనకు ఓ దుప్పటి, కొన్ని దుస్తులు అందించారు. దీంతో శనివారం రాత్రి క్రైమ్ బ్రాంచ్ కార్యాలయం వెయిటింగ్ రూంలోనే గాలి నిద్రపోయారు. ఆదివారం ఉదయం మళ్లీ విచారించేందుకు వచ్చిన ఏసీపీ వెంకటేష్ ప్రసన్న ‘‘రాత్రి బాగా నిద్రపోయారా?’’ అని గాలిని ప్రశ్నిస్తూ తిరిగి తన విచారణను మొదలుపెట్టారు.

ఈ కేసుకు, తనకు సంబంధం లేదని తొలుత గాలి జనార్దన్ రెడ్డి బుకాయించినప్పటికీ.. చివరికి అంబిడెంట్ కంపెనీపై ఉన్న ఈడీ కేసులో సంస్థ ప్రతినిధులకు సాయం చేసేందుకు యత్నించానని అంగీకరించినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఆదివారం గాలి జనార్ధన్ రెడ్డితోపాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది.

రూ.18 కోట్లు ఆర్టీజీఎస్ రూపంలో…

జనార్ధన్ రెడ్డి సూచనల మేరకు రూ.18 కోట్ల నగదును ఆర్టీజీఎస్ రూపంలో బదిలీ చేసేందుకు సహకరించిన బెంగుళూరు రియల్ ఎస్టేట్ వ్యాపారి బ్రిజేష్ రెడ్డి, ఫైజల్, జయరాం అనే వ్యక్తులను స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రశ్నించారు.

చివరికి గాలి జనార్ధన్ రెడ్డి తన నేరాన్ని అంగీకరించడంతో ఆయనతోపాటు ఆయన పీఏ అలీఖాన్‌ను కూడా ఆదివారం సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం వీరిద్దరినీ విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు కుట్ర పన్నడం, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నించడం వంటి అభియోగాల కింద గాలి జనార్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -