ఏపీ కేబినెట్ విస్తరణ: ఎన్‌ఎండీ ఫరూక్, కిడారి శ్రావణ్‌ల ప్రమాణ స్వీకారం.. హరికృష్ణ తర్వాత శ్రావణే…

farooq-shravan-oath-taking-ceremony
- Advertisement -

farooq-shravan-oath-taking-ceremony

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలోకి కొత్తగా ఇద్దరికి చోటు కల్పించారు. ఆదివారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులుగా ఎన్‌ఎండీ ఫరూక్, కిడారి శ్రావణ్‌ కుమార్ చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు.

వీరిద్దరి చేరికతో కేబినెట్‌లో ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ప్రాతినిథ్యం దక్కినట్టయింది. ముందుగా శాసన మండలి చైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్‌ మంత్రిగా ప్రమాణం చేశారు. తర్వాత కిడారి శ్రావణ్‌కుమార్ మంత్రిగా ప్రమాణం చేశారు. కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు సహా మంత్రులంతా హాజరయ్యారు.

టీడీపీ ఆవిర్భావం నుంచీ…

ఎన్‌ఎండీ ఫరూక్ పూర్తి పేరు నశ్యం మహ్మద్ ఫరూక్. స్వస్థలం నంద్యాల. పదో తరగతి వరకు చదువుకున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీతో ఆయనకు అనుబంధం ఉంది. 1981లో నంద్యాల మున్సిపల్ కౌన్సెలర్‌గా ఎన్నికయ్యారు. ఆ తరువాత మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు.

దివంగత నందమూరి తారక రామారావు హయాంలో ఫరూక్ మైనార్టీ మంత్రిగా కూడా పనిచేశారు. 2017 నవంబర్ నుంచి ఏపీ శాసన మండలి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఫరూక్‌కు వైద్య విద్య, మైనార్టీ సంక్షేమ శాఖ కేటాయించారు. 14 ఏళ్ల తర్వాత ఫరూక్‌ తిరిగి చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.

ఇక కిడారి శ్రావణ్‌కుమార్ విషయానికొస్తే.. తన తండ్రి హఠాన్మరణంతో ఈయన అతిపిన్న వయసులోనేరాజకీయాల్లోకి అడుగుపెట్టారు. శ్రావణ్ తండ్రి.. అరకు ఎమ్మెల్యే అయిన కిడారి సర్వేశ్వర్రావును ఆ మధ్యన మావోయిస్టులు హతమార్చిన సంగతి తెలిసిందే. వారణాసి ఐఐటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న శ్రావణ్ సివిల్స్ ‌కు ప్రిపేర్ అవుతున్న సమయంలో ఆయన తండ్రి హత్యకు గురయ్యారు.

దీంతో తన స్వస్థలానికి చేరుకున్న శ్రావణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు అనూహ్యంగా ఏపీ కేబినెట్‌లో స్థానం దక్కించుకుని అతి పిన్నవయసులో మంత్రిగా రికార్డులకెక్కారు. కిడారి శ్రావణ్‌కు వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారు.

చట్టసభల్లో సభ్యుడు కాకున్నా…

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిడారి శ్రావణ్‌కుమార్‌ చట్టసభల్లో సభ్యుడు కాకుండానే నేరుగా మంత్రివర్గంలో స్థానం పొందారు. 1995లో నందమూరి హరికృష్ణ తర్వాత శ్రావణ్‌కే ఈ రకమైన అవకాశం లభించింది. నిజానికి ఏ చట్టసభ (శాసనసభ లేదా శాసనమండలి) లోనూ సభ్యుడు కాకుండా మంత్రివర్గంలో చేరితే ఆరు నెలల్లోగా ఏదో ఒక చట్టసభకి ఎన్నిక కావాల్సి ఉంటుంది.

అయితే సాధారణ ఎన్నికలకు ఏడాదిలోపే సమయం ఉండటంతో అరకు స్థానానికి ఉపఎన్నిక జరిగే అవకాశం లేకపోయింది. అలాగే ఏ శాసనమండలి స్థానమూ ఖాళీగా లేదు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు… చట్టసభల్లో సభ్యుడు కాకున్నా 6 నెలల పాటు మంత్రిగా కొనసాగే అవకాశాన్ని శ్రావణ్‌కుమార్‌కు కల్పించారు.

ఈలోపే 2019లోఎలాగూ సాధారణ ఎన్నికలు వస్తాయి కాబట్టి.. అరకు స్థానం నుంచి మళ్లీ శ్రావణ్‌ ‌కుమార్‌నే పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలపనున్నారు.

- Advertisement -