23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం భారత్‌కు అమెరికా షాక్: ప్రాధాన్యత వాణిజ్య హోదా తొలగిస్తామంటూ ట్రంప్

భారత్‌కు అమెరికా షాక్: ప్రాధాన్యత వాణిజ్య హోదా తొలగిస్తామంటూ ట్రంప్

Modi-and-Trump
- Advertisement -

వాషింగ్టన్‌: భారత్‌కు మరోసారి షాకిచ్చేందుకు సిద్ధమైంది అమెరికా. ఇప్పటికే భారత వస్తువులపై అత్యధిక సుంకాలు విధిస్తామని చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. తాజాగా సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎలాంటి సుంకాలు లేకుండా భారత్ కొన్ని వస్తువులను అమెరికాకు ఎగుమతి చేసేందుకు వీలుగా ఇస్తున్న ప్రాధాన్యత వాణిజ్య హోదాను తొలగించాలని యోచిస్తున్నట్లు తెలిపారు.

ఈ మేరకు యూఎస్‌ కాంగ్రెస్‌ సభ్యులకు ట్రంప్‌ లేఖ ద్వారా తెలియజేశారు.‘సాధారణ ప్రాధాన్యతల వ్యవస్థ(జీఎస్‌పీ) కింద అమెరికా మార్కెట్లలో భారత్‌కు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నాం. భారత మార్కెట్లలోనూ మన దేశానికి అలాంటి సదుపాయాలు కల్పించాలని అమెరికా కోరినప్పటికీ.. భారత్‌ దానిపై స్పష్టమైన హామీ ఇవ్వట్లేదు. అందుకే భారత్‌కు ఇస్తున్న ప్రాధాన్యత వాణిజ్య హోదాను ఉపసంహరించాలనే యోచిస్తున్నాం’ అని యూఎస్‌ కాంగ్రెస్‌కు రాసిన లేఖల్లో ట్రంప్ స్పష్టం చేశారు.

జీఎస్‌పీ ప్రోగ్రామ్‌ కింద అమెరికా కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాధాన్యత వాణిజ్య హోదా కల్పిస్తోంది. అందులో భారత్‌ ఒకటి. దీని ద్వారా అమెరికా మార్కెట్లలోకి కొన్ని వస్తువులను ఎలాంటి సుంకాలు లేకుండా ఎగుమతి చేసేందుకు మన దేశానికి వీలుంది. ఇప్పుడు ఆ హోదాను తొలగిస్తే.. భారత్‌ నుంచి ఎగుమతి చేసే అన్ని వస్తువులకు అమెరికా సుంకాలు విధిస్తుంది. దీని వల్ల దేశానికి భారీ నష్టం ఏర్పడే ప్రమాదం ఉంది.

కాగా, ఈ చర్యతో భారత్‌, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. ఇది ఇలావుంటే, భారత్‌తో పాటు టర్కీకి కూడా ఈ హోదాను ఉపసంహరించుకోవాలని ట్రంప్‌ భావిస్తున్నారు. గత నాలుగున్నర దశాబ్దాల్లో టర్కీ ఆర్థిక వ్యవస్థ బాగా వృద్ధి చెందిందని, అందుకే ఇక ఆ దేశానికి ప్రాధాన్యత హోదా అవసరం లేదని ట్రంప్‌ మరో లేఖలో వెల్లడించారు.

పెద్ద ప్రభావమేమీ ఉండదు.. భారత్ స్పందన

ఇది ఇలావుంటే, అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం వల్ల అమెరికాకు భారత వాణిజ్యంలో ఎలాంటి పెద్ద ప్రభావం ఉండదని భారత్ పేర్కొంది. ఈ నిర్ణయం మన దేశ ఎగుమతులపై పెద్ద ప్రభావమేమీ చూపించదని వాణిజ్య శాఖ
కార్యదర్శి అనూప్‌ వాధవన్‌ తెలిపారు.

‘సాధారణ ప్రాధాన్యత వ్యవస్థ కింద భారత్‌ 5.6 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేస్తోంది. ఈ ఎగుమతుల వల్ల భారత్‌కు ఏటా కేవలం 190 మిలియన్‌ డాలర్ల ప్రయోజనం చేకూరుతుంది. జీఎస్‌పీ తొలగింపుతో భారత ఎగుమతులపై పెద్ద ప్రభావమేమీ ఉండదు. అంతేగాక భారత్‌, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ఎలాంటి ప్రభావం చూపించదు’ అని అనూప్‌ ఓ మీడియా కార్యక్రమంలో తెలిపారు.

- Advertisement -