
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మధ్య ఢిల్లీలోని ఓ ప్రభుత్వ భవనంలో మంటలు చెలరేగాయి. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. లోధి రోడ్‌లోని పండిత్ దీన్‌దయాళ్ అంత్యోదయ భవన్ ఐదో అంతస్తులో బుధవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. 25 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేందుకు యత్నించారు.
గాయపడ్డ సెక్యూరిటీ అధికారి
కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కార్యాలయంలో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో భవనం సెక్యూరిటీ అధికారి గాయపడగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ భవనంలో భారత ఎయిర్‌ఫోర్స్ బ్రాంచీ, తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వశాఖ, అటవీ శాఖ, ఎన్డీఆర్‌ఎఫ్ సహా అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. కాగా, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇటీవల ఢిల్లీలోని ఓ హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగి 17 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.








