
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. దేశంలో 2030 నాటికి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం లభించేలా మేనిఫెస్టోను రూపొందించామని చెప్పారు.
కొత్త మార్గదర్శకంలో కాంగ్రెస్ పార్టీ విజన్‌ను ఆవిష్కరించామని చెప్పారు. ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశామని తెలిపారు. ముఖ్యంగా ఐదు అంశాలపై దృష్టి సారించామని వివరించారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రియాంక గాంధీ, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, రణ్‌దీప్ సుర్జేవాలా తదితరులు పాల్గొన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా
2014లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంటులో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని వెల్లడించారు.
ఇక ఢిల్లీతోపాటు పుదుచ్చేరిలకు రాష్ట్రస్థాయి హోదా ఇస్తామని పేర్కొన్నారు.
మేనిఫెస్టోలోని ఐదు ప్రధానాంశాలు..
1. న్యాయ్ పథకం ద్వారా ఏడాదికి రూ.72వేలు చొప్పున పేదలకు అందిస్తాం. ఈ పథకం రెండు రకాలుగా పనిచేస్తుంది. మొదటగా ఇది పేదల జేబుల్లో డబ్బులు నింపుతుంది. రెండోది నోట్ల రద్దుతో దెబ్బతిన్న దేశ ఆర్థికపరిస్థితిని మెరుగుపరుస్తుంది. నెలకు రూ.12వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న వారికే ఈ పథకం వర్తిస్తుంది.
2. ప్రస్తుతం ఖాళీ ఉన్న 22 లక్షల పోస్టులను భర్తీ చేస్తాం. పంచాయతీల్లో 10 లక్షల ఉద్యోగాలను పూరిస్తాం. కొత్తగా వ్యాపారం చేసుకునేవారికి తొలి మూడేళ్ల పాటు ఎలాంటి అనుమతులూ అవసరం లేకుండా చేస్తాం. గ్రామీణ ఉపాధి హామీని పటిష్ఠం చేస్తాం. ఇప్పుడున్న పని దినాలను 100 నుంచి 150కి పెంచుతాం.
3. రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్‌ను తీసుకొస్తాం. రుణాలు చెల్లించలేని రైతులపై పెట్టే కేసులను క్రిమినల్ కేసులుగా పరిగణించం.
4. విద్యపై జీడీపీలో 6 శాతం ఖర్చు.
5. జాతీయ, అంతర్గత భద్రతకు పెద్దపీట.
చదవండి: యూటర్న్ బాబుకు పోలవరం ఏటీఎంలా: భళ్లాల దేవుడంటూ ఏకిపారేసిన మోడీ








