షాకింగ్: ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా! కేంద్రంతో ముదిరిన విభేదాలు?

rbi-governor-urjit-patel-resignation
- Advertisement -

rbi-governor-urjit-patel-resignation

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ సోమవారం అనూహ్యంగా రాజీనామా చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కీలక విధాన నిర్ణయాలపై కేంద్ర ప్రభుత్వంతో కొద్దిరోజులుగా ఆయన ఢీ అంటే ఢీ అనే రీతిలో తలపడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉన్నట్లుండి ఉర్జిత్ పటేల్ తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం విస్మయం కలిగించింది.

అయితే ఉర్జిత్ పటేల్ రాజీనామాకు దారితీసిన అసలు కారణాలు బయటికి రాలేదుగానీ.. తాను వ్యక్తిగత కారణాలతోనే ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి తక్షణమే వైదొలుగుతున్నానంటూ ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసినందుకు గర్విస్తున్నానని, అలాగే పదవీకాలంలో తనకు సహకరించిన ఉద్యోగులు, ఆర్బీఐ డైరెక్టర్లకు ఉర్జిత్ కృతజ్ఞతలు తెలిపారు.

పదవీకాలం కన్నా చాలాముందే…

2016 నుంచి ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగుతున్న ఉర్జిత్‌ పటేల్‌‌కు 2019 సెప్టెంబర్‌ వరకు పదవీకాలం ఉంది. కానీ ఆయన తన పదవీకాలం కన్నా చాలాముందే రాజీనామా చేశారు. ఉర్జిత్‌ పటేల్‌ హయాంలోనే పెద్దనోట్ల రద్దు వంటి తీవ్రమైన నిర్ణయాలను మోడీ సర్కారు తీసుకున్న సంగతి తెలిసిందే.

కొంతకాలంగా విధానపరమైన నిర్ణయాల విషయంలో ఉర్జిత్‌ పటేల్‌ కేంద్రంతో విబేధిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాను చెప్పినట్టు వినకుండా ఉర్జిత్‌ స్వతంత్రంగా వ్యవహరిస్తుండటం కూడా కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది.

అయితే ఆర్థిక వ్యవస్థ పరంగా దేశం ఒకింత క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ఉన్నట్లుండి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడం రాజకీయంగా దుమారం రేపే అవకాశముంది. ఉర్జిత్‌ రాజీనామాను అస్త్రంగా చేసుకొని.. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు మోడీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశాలు లేకపోలేదు.

- Advertisement -