29.2 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం త్వరలో ఉద్యోగులకు తీపికబురు!? భారీ కానుకను సిద్ధం చేస్తున్న కేంద్రం?

త్వరలో ఉద్యోగులకు తీపికబురు!? భారీ కానుకను సిద్ధం చేస్తున్న కేంద్రం?

amit-shah-narendra-modi
- Advertisement -

 

amit-shah-narendra-modi

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల దగ్గర పడుతున్నకొద్దీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజాకర్షక పథకాలకు తెరతీస్తోంది. మొన్నటికి మొన్న అగ్రవర్ణాలకు చెంది ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు ప్రకటించగా, నిన్న ఎంఎస్ఎంఈ వ్యాపార వర్గాలకు జీఎస్టీ పరిమితిని డబుల్ చేసింది. తాజాగా దేశంలోని ఉద్యోగులకు కూడా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం తీపి కబురు వినిపించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ నేపథ్యంలో అది ఆదాయపన్నుకు సంబంధించినదే అయి ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు మరో 100 రోజుల దూరం ఉండడంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని అన్ని వర్గాలను ఆకట్టుకోవడం ద్వారా ఓట్లు దక్కించుకుని తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రభుత్వం యోచిస్తోన్నట్లు సమాచారం.

ఉద్యోగ వర్గాలు ఎంతోకాలంగా ఆదాయపు పన్నుకు సంబంధించి మినహాయించదగిన ఆదాయ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని కోరుతున్నాయి.

ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి డబుల్?

నిజానికి గత బడ్జెట్‌లోనే ఈ ఆదాయ పన్నుకు సంబంధించి మినహాయింపు ఇవ్వదగిన ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలంటూ ఎన్నో వినతులు అందినా, బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్య తీసుకోలేదు. అయితే ఫిబ్రవరి 1న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పరోక్ష పన్నుల విధానంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

అలాగే కార్పొరేట్ పన్ను చెల్లింపుదారులకు విధించే పన్ను రేటులో కూడా మార్పులు ఉండే అవకాశాలు లేవని అంటున్నారు. ప్రత్యక్ష పన్నులకు సంబంధించి ముఖ్యంగా ఆదాయపు పన్నుకు సంబంధించి ఉద్యోగ వర్గాలను ఆకట్టుకునేందుకు మోడీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చే అవకాశం లేకపోలేదని, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మినహాయించదగిన ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచే దిశగా భారీ కసరత్తు జరుగుతోంది. ఒకవేళ ఇదేగనుక నిజమైతే ఉద్యోగులకు పండగే!

- Advertisement -