

హైదరాబాద్: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయం లాంజ్‌లో జరిగిన హత్యాయత్నం వెనుక ఎవరున్నారన్న కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన జనుపల్లి శ్రీనివాసరావును సోమవారం హైదరాబాద్‌లో ఎన్ఐఏ అధికారులు విచారించారు.
న్యాయవాదుల సమక్షంలో శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఎన్‌ఐఏ డీఐజీ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఈ విచారణ పర్వం కొనసాగింది. నిందితుడు శ్రీనివాసరావు వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేశారు. వైఎస్ జగన్‌పై దాడి ఎందుకు చేశావు? దాడి వెనుక ఎవరున్నారు? ఇలాంటి విషయాలపై వారు చాలా లోతుగా విచారించారు. శ్రీనివాసరావు కాల్ డేటాను పరిశీలించి, అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం.
సోమవారంతో నిందితుడు శ్రీనివాసరావు మూడో రోజు కస్టడీ ముగిసింది. క్రైం సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా మంగళవారం మరోసారి అతడ్ని విశాఖపట్నం విమానాశ్రయానికి తీసుకెళ్లి అక్కడ విచారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును వారం రోజులపాటు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో శనివారం ఉదయం శ్రీనివాసరావును ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం విశాఖపట్నంలో అతడిని విచారించిన వారు సోమవారం హైదరాబాదుకు తీసుకొచ్చి విచారించారు.
ఆదివారం ఏం జరిగిందంటే…
శనివారం అర్ధరాత్రి దాటాక విజయవాడ జైలు నుంచి నిందితుడు శ్రీనివాసరావును విశాఖపట్నం బక్కన్నపాలెంలోని ఏపీఎస్‌పీ బెటాలియన్‌కు తీసుకొచ్చారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు అతడి న్యాయవాది అబ్దుల్ సలీం సమక్షంలో విచారించారు.
తర్వాత తెల్లచొక్కా, నల్ల ప్యాంటు ధరించిన నిందితుడిని అక్కడి నుంచి సాయంత్రం 3.45 గంటల సమయంలో ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ వాహనంలో విశాఖపట్నం విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడ అతడికి ముసుగు వేసి ఎయిర్‌పోర్టులోకి తీసుకెళ్లారు. లోపలకు వెళ్లాక ముసుగు తొలగించారు.
వీఐపీ లాంజ్‌లోకి తీసుకెళ్లి…
క్రైం సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగిన వీఐపీ లాంజ్‌లోకి శ్రీనివాసరావును వెంటబెట్టుకుని వెళ్లారు. అక్కడ అతడిని పలు అంశాలపై ప్రశ్నించారు. ఘటన జరిగిన తీరుతెన్నులను ఆరా తీశారు. ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లోని నేరస్థలం, కత్తిని భద్రపరిచిన ప్రదేశాన్ని పరిశీలించారు.
అనంతరం శ్రీనివాసరావు పనిచేసిన తెలుగుదేశం పార్టీ నేత హర్షవర్దన్ ప్రసాద్ చౌదరికి చెందిన ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్‌కు తీసుకెళ్లారు. దాదాపు 20 నిమిషాలపాటు ఎన్ఐఏ అధికారులు అక్కడ ఉన్నారు. రెస్టారెంట్‌లో నిందితుడు విధులు నిర్వహించిన ప్రాంతాన్ని కూడా వారు పరిశీలించారు. అక్కడ ఏయే పనులు చేసేవాడివంటూ శ్రీనివాసరావును ప్రశ్నించారు.
ఆ ఇద్దరూ అక్కడ లేరు…
నిందితుడు శ్రీనివాసరావును విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో విచారణకు తీసుకొచ్చిన సమయంలో ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని, టీడీపీ నేత హర్షవర్దన్ ప్రసాద్ చౌదరి అక్కడ లేరు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎయిర్‌పోర్టు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వేణుగోపాల్ కూడా లేరు. నిందితుడిని ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చే సమయంలోనూ విశాఖపట్నం పోలీసు అధికారులెవరూ వెంట రాలేదు.
విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో శ్రీనివాసరావును దాదాపు రెండు గంటల పాటు ఎన్‌ఐఏ అధికారులు ప్రశ్నించారు. మళ్లీ సాయంత్రం 6 గంటలకు విశాఖ నుంచి హైదరాబాద్ మీదుగా దుబాయ్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో నిందితుడిని వెంటబెట్టుకుని హైదరాబాద్‌కు పయనమయ్యారు. శ్రీనివాసరావు వెంట ఎన్‌ఐఏ అధికారులు సాజిద్ మహ్మద్, ప్రసాద్, మరో అధికారి ఉన్నారు.
మాదాపూర్‌కు తరలించి.. అక్కడ…
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి భారీ బందోబస్తు మధ్య శ్రీనివాసరావును మాదాపూర్‌లోని ఎన్‌ఐఏ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. వారంరోజుల పాటు నిందితుడ్ని తమ కస్టడీకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం వెనుకున్న కారణాలు, సూత్రధారుల పాత్రను వెలుగులోకి తీసుకొచ్చేందుకు మాదాపూర్ కార్యాలయంలోనే విచారణ జరుపనున్నట్టు తెలిసింది.
ముందుగా అనుకున్నట్టు విజయవాడ లేదా విశాఖపట్నంలోనే నిందితుడిని విచారించాలని భావించారు. అయితే, అక్కడి పరిస్థితులు అనుకూలించకపోవడంతో హైదరాబాద్ మాదాపూర్‌లోని తమ కార్యాలయంలోనే విచారించడం మంచిదని నిర్ణయానికొచ్చినట్లు సమాచారం. అందులో భాగంగా మాదాపూర్‌లోని కార్యాలయంలోనే మిగిలిన విచారణ కొనసాగించాలని భావిస్తున్నారు.








