

కృష్ణా: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతామని తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. సోమవారం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మూడపాడులో నిర్వహించిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో తలసాని పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రూ.5000 కోట్లతో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, ఏపీలో కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి యాదవులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఏపీ ప్రజలే సిద్ధంగా ఉన్నారు…
అనంతరం ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ దుర్గగుడి వరకు తలసాని భారీ ర్యాలీగా బయలుదేరి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని, చంద్రబాబు కేవలం ప్రచారానికి పరిమితమైన నాయకుడని విమర్శించారు. టీఆర్‌ఎస్ కాదు, చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఏపీ ప్రజలే సిద్ధంగా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.
ఏపీలో కుల రాజకీయాలకు చంద్రబాబునాయుడే కారణమని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ప్రభ్వుతంలో ఉన్న వాళ్లే భిన్న రకాలుగా మాట్లాడారటూ విమర్శించారు. ప్రత్యేక హోదాకు తమ పార్టీ ఎప్పుడూ మద్దతు ఇస్తుందని తలసాని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో బీసీలకు ప్రాధాన్యం కల్పించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.








