ఇక గవర్నర్ పదవుల పందేరం! సీనియర్లకు బీజేపీ హైకమాండ్ బంపర్ ఆఫర్, నరసింహన్‌కు స్థాన చలనం?

4 days ago
narendra-modi-amit-shah

న్యూఢిల్లీ: త్వరలో దేశ వ్యాప్తంగా గవర్నర్ల మార్పు, ఆయా రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం జరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై ఇప్పటికే మోడీ ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయని పార్టీ సీనియర్లకు గవర్నర్ పదవులు కట్టబెట్టాలని ఆ పార్టీ హైకమాండ్ భావిస్తోంది.

గత ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రులు, సీనియర్ నేతలను.. గౌరవప్రదమైన పోస్టులు కట్టబెట్టడం ద్వారా గౌరవించాలని బీజేపీ జాతీయ నాయకత్వం యోచిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా ఇప్పటికే దీనిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

చదవండి: ఇక ‘ఫ్రీ బర్డ్’: ఎంజాయ్ చేస్తోన్న రాహుల్ గాంధీ! మొన్న థియేటర్‌లో సినిమా, నిన్న…

గతంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్‌, లోక్‌ సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, సీనియర్ నేతలు కల్‌రాజ్ మిశ్రా, శాంత కుమార్‌, ఉమాభారతితో పాటు మరికొందరు సీనియర్లకు త్వరిలోనే గవర్నర్‌ పదవి ఇవ్వనున్నట్లు సమాచారం.

గవర్నర్ పదవుల రేసులో వీరితోపాటు రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్ వింగ్‌(రా) మాజీ చీఫ్‌ అనిల్‌ కుమార్‌, ఇంటెల్సిజెన్స్‌ మాజీ చీఫ్‌ రాజీవ్‌ జైన్‌, మాజీ ఎన్నికల ప్రధాన అధికారి దినేశ్వర్‌ శర్మ, హిమాచల్‌ ప్రదేశ్ మాజీ సీఎంలు ప్రేమ్‌ కుమార్‌ ధమాల్‌, శాంతా కుమార్‌‌ కూడా ఉన్నట్లు చెబుతున్నారు.

త్వరలోనే ప్రకటన కూడా…

దీనిపై త్వరలోనే ఒక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్ల పదవీకాలం ముగియనుంది. ముఖ్యంగా ఈ నెలలోనే ఐదు రాష్ట్రాల గవర్నర్ల పదవీకాలం ముగియనుంది.

చదవండి: కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్! సచివాలయం, ఇర్రం మంజిల్ భవనాలు కూల్చివేతపై స్టే…

గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లీ పదవీకాలం ఈనెల 16తో ముగియనుండగా, యూపీ గవర్నర్ రామ్‌ నాయక్‌, పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీల పదవీ కాలం సైతం ఈనెల 24తో ముగియనుంది. ఇక త్రిపుర గవర్నర్‌ కప్తాన్‌ సింగ్‌ పదవీకాలం కూడా జులై 27తో ముగియనుంది.

ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలతో ఆయా రాష్ట్రాలకు గవర్నర్ పదవులను భర్తీ చేయించేందుకు మోడీ అండ్ షా వ్యూహరచన చేస్తున్నట్లు, దీనిపై తీవ్ర కసరత్తు సమాచారం.

మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల గవర్నర్ల పదవీ కాలం ఆగష్టు నెలలో ముగియనుంది. ఈ నేపథ్యంలో వారి స్థానాల్లోనూ బీజేపీ సీనియర్లకు అవకాశం ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

పార్టీలో సీనియర్ నేతలైన సుష్మా స్వరాజ్‌, సుమిత్రా మహాజన్‌లకు కూడా తొలిసారిగా గవర్నర్లుగా అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.  ఈ నేపథ్యంలో పంజాబ్‌ గవర్నర్‌గా సుష్మాస్వరాజ్, మహారాష్ట్ర గవర్నర్‌గా సుమిత్రా మహాజన్‌‌ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈఎస్ఎల్ నరసింహన్‌కు ఉద్వాసన?

మరోవైపు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కూడా మార్చే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాలూ విడిపోక ముందునుంచీ గవర్నర్‌గా ఉన్న ఆయన్ని రాష్ట్ర విభజన అనంతరం కూడా కొనసాగిస్తూ వచ్చారు.

దీంతో చాలా సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఆయనే గవర్నర్‌గా ఉంటున్నారు. ఈసారి గవర్నర్ల మార్పులు చేర్పుల నేపథ్యంలో నరసింహన్‌ స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి.

చదవండి: సీఎం వైఎస్ జగన్ టీంలోకి మరో ఉన్నతాధికారి! డిప్యూటేషన్‌పై ఏపీకి, పోస్టింగ్ ఎక్కడో?

అయితే ఆయన్ని ఇక్కడ్నించి మరో రాష్ట్రానికి బదిలీ చేస్తారా? లేకుంటే ఆయనకు ఉద్వాసన పలుకుతారా? అనేది స్పష్టంగా తెలియడం లేదు. ఎందుకంటే నరసింహన్‌ పదవీకాలాన్ని ఇంకా పెంచేందుకు కేంద్రం విముఖంగా ఉన్నట్లు సమాచారం.

మొత్తంమీద గవర్నర్ల నియామకంపై కేంద్రం నిశిత దృష్టి సారించిందని, ఈ విషయంలో త్వరలోనే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.