పాట్నా: అధికార బీజేపీకి మరో పార్టీ నుంచి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుతున్నట్టు బీహార్‌లోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్‌పీ) ప్రకటించింది. సీఎం నితీశ్ కుమార్ వైఖరికి నిరసనగా… గురువారం పాట్నాలో జరుగుతున్న ఎన్డీఏ సమావేశాన్ని కేంద్రమంత్రి, ఆర్ఎల్ఎస్‌పీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహ బహిష్కరించారు. దీంతో ఎన్డీయే మిత్రపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తేవాలన్న బీజేపీ ప్రయత్నాలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
చదవండి: ఎన్డీఏలో లుకలుకలు! అద్వానీని కలిసిన మోడీ, అమిత్ షా?
2019 ఎన్నికల్లో బీహార్ ఎన్డీఏ సారథిని తానేనంటూ నితీశ్ కుమార్ ప్రకటించుకోవడంపై కుష్వాహ తీవ్రంగా కలత చెందినట్టు ఆర్ఎల్ఎస్‌పీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏలోని భాగస్వామ్య పక్షాలకు ఎన్నెన్ని సీట్లు ఇస్తారో నిర్ణయించాలని కూడా ఈ నెల 2నే ఆర్ఎల్ఎస్‌పీ కోరింది. మరోవైపు ఎన్డీఏకి గుడ్‌బై చెప్పిన ఆర్ఎల్ఎస్‌పీ… బీహార్ మహాకూటమిలో చేరేందుకు ఇప్పటికే ఆర్జేడీని సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి.