

బెంగళూరు: ఇటీవల కాలంలో కుల వృత్తులు గానీ, వ్యవసాయం చేసే అబ్బాయిలను పెళ్లి చేసుకునేందుకు చాలా అమ్మాయిలు ముందుకు రావడం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటకలోని యల్లాపుర ప్రాంతానికి చెందిన ఆనగోడ గ్రామ సేవా సహకార సంఘం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
తమ గ్రామానికి చెందిన యువ రైతులను పెళ్లి చేసుకునే అమ్మాయిలకు ‘షాదీ భాగ్య’ పేరిట రూ.లక్ష బహుమతిగా ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే, ఇందుకోసం ఆయా యువకులు తమ సహకార సంఘంలో చేరాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇందులో కులాల ప్రసక్తి లేదని తేల్చిచెప్పింది.
కేవలం ఈ గ్రామానికి చెందిన అమ్మాయిలే కాకుండా పక్క గ్రామాలకు చెందిన యువతులు కూడా ఆ గ్రామ రైతులను పెళ్లాడవచ్చు. మంచి ఉద్యోగంతోపాటు అందం, ఆస్తులు, అన్నీ చూసిన తర్వాతే నేటి అమ్మాయిలు వివాహం చేసుకునేందుకు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇక కుల వృత్తులు, వ్యవసాయం అంటే మాత్రం ముందుకు రావడం లేదు. ఈ క్రమంలోనే ఈ సహకార సంఘం ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.








