నేటి నుంచి బ్యాంకుల పనివేళల్లో మార్పు.. ఖాతాదారుల అవసరాల మేరకు సేవలు

8:39 am, Tue, 1 October 19

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల పనివేళల్లో మంగళవారం (అక్టోబర్ 1, 2019) నుంచి మార్పులు చోటుచేసుకున్నాయి. స్థానిక ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా రిజర్వు బ్యాంకు సూచించిన మూడు రకాల పని వేళల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకుని అమలు చేస్తారు.

దేశంలోని 400 జిల్లాల్లో ఖాతాదారులకు బ్యాంకు సేవలను మరింత చేరువ చేసేందుకు ఈ నెల 3 నుంచి 7 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించున్నట్టు రాష్ట్ర బ్యాంకర్ల సమితి కన్వీనర్ కేవీ నాంచారయ్య తెలిపారు.

సోమవారం విజయవాడలో ఇండియన్ బ్యాంకు జోనల్ మనేజర్ మణిమాల, ఎస్‌బీఐ ఏజీఎం డీజే ప్రసాద్, ఆంధ్రా బ్యాంకు డీజీఎం వెంకటేశ్వర స్వామి, ఎస్ఎల్‌బీసీ ఏజీఎం కె అజయ్‌పాల్ తదితరులు మీడియాతో మాట్లాడారు.

మూడు రకాల పనివేళలు…

భారత బ్యాంకర్ల సంఘం(ఐబీఏ) సూచనల మేరకు మూడు రకాల పనివేళలు రూపొందించారు.
* ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు
* ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు
* ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 5 గంటల వరకు

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా స్థాయి సంప్రదింపుల సమితిలో చర్చించి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితికి పంపిస్తారు. వారి ఆమోదంతో ఈ పనివేళలు అమలు చేస్తారు.

ఖాతాదారులు సిబిల్ స్కోరు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఇందులో రైతులకు కూడా మినహాయింపు లేదు. ప్రకృతి వైపరీత్యాలు, రుణాల రీషెడ్యూల్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని స్థానిక బ్యాంకు మేనేజర్లు సానుకూల నిర్ణయం తీసుకుంటారు.