గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది దుర్మరణం…

8:13 am, Tue, 1 October 19

అహ్మదాబాద్: గుజరాత్‌లో సోమవారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడి 21మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం సాయంత్రం బనస్కాంత జిల్లాలోని అంబాజీ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.  

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 70 మందికి పైగా ప్రయాణికులు ఉండగా వారిలో 21 మంది అక్కడిక్కడే మృతిచెందినట్టు అదనపు జిల్లా వైద్యాధికారి ధ్రువీకరించారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం బనస్కాంతలోని సమీప ఆస్పత్రికి తరలించారు.

మోడీ, అమిత్ షా తీవ్ర దిగ్భాంతి…

సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బస్సు ప్రమాదంలో ప్రయాణికులు మృతిచెందడం బాధాకరమని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

హోం మంత్రి అమిత్ షా కూడా బస్సు ప్రమాద ఘటనపై తన సంతాపాన్ని తెలియజేశారు. బస్సు ప్రమాదంలో మృతి చెందినవారి పట్ల విచారం వ్యక్తం చేశారు. స్థానిక అధికారులతో మాట్లాడి ప్రతిఒక్కరికి సాధ్యమైనంత తొందరగా అత్యవసర సాయం అందించాలని కోరినట్టు ట్వీట్ చేశారు.

గాయపడ్డ ప్రయాణికులు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు.