23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం అయోధ్య కేసు: వివాదంలో లేని భూమిని యజమానులకు అప్పగించాలని సుప్రీంకు కేంద్రం

అయోధ్య కేసు: వివాదంలో లేని భూమిని యజమానులకు అప్పగించాలని సుప్రీంకు కేంద్రం

supreme-court
- Advertisement -

న్యూఢిల్లీ: అయోధ్యలో వివాదాస్పద రామ జన్మభూమి-మసీదు సమీపంలో వివాదంలో లేని 67 ఎకరాల ప్రాంతాన్ని అసలైన యజమానులకు అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టును కోరింది. రామ జన్మభూమికి సమీపంలో వివాదంలో లేని ప్రాంతాన్ని దాని యజమాని అయిన రామ జన్మభూమి నయాస్‌ లేదా రామాలయానికి సంబంధించిన ట్రస్టుకు అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

రామ జన్మభూమి-మసీదు వివాదాస్పద ప్రాంతం 2.77ఎకరాలు కాగా 1991లో ప్రభుత్వం దాంతోపాటు వివాదాస్పద స్థలం చుట్టూ ఉన్న 67 ఎకరాలను కూడా స్వాధీనం చేసుకుంది. అయితే, వివాదంలో లేని మిగతా 67ఎకరాల భూమిని తమకు అప్పగించాలని రామ జన్మభూమి న్యాస్‌ కోరుతోందని కేంద్రం తాజాగా సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది.

కాగా, గతంలో సుప్రీంకోర్టు ఈ 67 ఎకరాలను కూడా యథావిధిగా కేంద్రం ఆధీనంలోనే ఉంచాలని, వివాదం తేలే వరకూ ఎలాంటి మార్పులు చేయొద్దని ఆదేశించింది. వివాదాస్పద భూమిని మూడు పార్టీలు సున్ని వక్ఫ్‌ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్‌ లల్లా సమానంగా పంచుకోవాలని 2010లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంలో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంలో కేసు విచారణ కొనసాగుతోంది.

ఆ భూమి అప్పగిస్తే విధ్వంసమే: మెహబూబ్ అహ్మద్

కాగా, కేంద్రం తాజాగా సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై సున్నీ వక్ఫ్ బోర్డు ప్రతినిధి హాజి మెహబూబ్ అహ్మద్ మండిపడ్డారు. ఆ భూమికి నిజమైన హక్కుదారులు హిందువులు కాదని ఆయన అన్నారు. దీని వెనుక భారీ కుట్ర దాగి ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పిటిషన్‌కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును వెలువరిస్తే… దేశ వ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరించడం గమనార్హం.

- Advertisement -