29.2 C
Hyderabad
Saturday, August 29, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ మేక్ ఇన్ ఇండియా: ఏపీ నుంచి తొలి కియా కారు విడుదల చేసిన చంద్రబాబు

మేక్ ఇన్ ఇండియా: ఏపీ నుంచి తొలి కియా కారు విడుదల చేసిన చంద్రబాబు

kia car
- Advertisement -

kia car

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారైన తొలి కారును విడుదల చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లా ఎర్రమంచిలో ప్రతిష్ఠాత్మక కియా కార్ల సంస్థ నుంచి తొలి కారు విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

దక్షిణ కొరియా, ఏపీకి ఎన్నో సారూప్యతలు ఉన్నాయని చెప్పారు. దక్షిణ కొరియా వారిలాగే తెలుగువారు కూడా ప్రపంచంలో ఎక్కడైనా జీవించగలరని, పనిలో తమదైన ముద్ర వేయగలరని చంద్రబాబు చెప్పారు. తక్కువ సమయంలోనే కియా మోటార్‌ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టామని సీఎం చెప్పారు.

2017లో నిర్మాణం ప్రారంభించి ట్రయల్‌ ప్రొడక్షన్‌ స్థాయికి చేరుకుందని చెప్పారు. కియా పెట్టుబడులతో అనంతపురం ప్రాంతం ఆటో మొబైల్ పారిశ్రామిక హబ్‌గా మారుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. కొరియా రాయబారి ఏపీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో హీరో మోటార్స్‌, అపోలో టైర్, అశోక్‌ లేలాండ్‌, భారత్‌ ఫోర్డ్‌ వంటి సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని చంద్రబాబు వివరించారు. పరిశ్రమలను ఆకట్టుకునేందుకు ఎలక్ట్రిక్‌ మొబిలిటీ పాలసీ వంటి విధానాలు తీసుకొచ్చామని చంద్రబాబు వివరించారు.

కియా మోటార్స్‌కు భారత్‌ అతిపెద్ద మార్కెట్‌ అవుతుందని.. ఏపీని సొంత ప్రాంతంగా భావించాలని కొరియా అధికారులు, సిబ్బందికి సీఎం సూచించారు. అవసరమైన ఉత్తమ మౌలిక సదుపాయాలను తాము కల్పిస్తామని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్బంగా కియా మోటార్స్‌ ఎండీ కుక్యున్‌ షిన్‌ మాట్లాడుతూ.. భారత్‌తో తమ బంధం సుదీర్ఘమైనదని అన్నారు. అనంతపురం ప్లాంట్‌ను త్వరితగతిన నిర్మించేందుకు సహాయ సహకారాలు అందించిన ఏపీ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కియా కార్ల తయారీ పరిశ్రమ ఏపీకి రావడంలో చంద్రబాబు కృషి ఎంతో ఉందని పలువురు నేతలు ప్రశంసించారు.

కియా కార్ల పరిశ్రమ ప్రత్యేకత

దక్షిణ కొరియాకు చెందిన హ్యుండాయ్‌ గ్రూప్‌నకు కియా అనుబంధ సంస్థ. అనంతపురం జిల్లాలోని పెనుకొండ సమీపంలోని కర్మాగారం కోసం రూ.13,500 కోట్లు వెచ్చిస్తోంది. ఈ ప్లాంట్ ద్వారా 11 వేల మందికి ఉపాధి లభిస్తోంది. అనుబంధ పరిశ్రమల ద్వారా రూ.2,920 కోట్ల పెట్టుబడులతోపాటు, 3,900 మందికి ఉపాధి కలగనుంది.

కాగా, ఈ ప్లాంట్‌లో ఏడాదికి సగటున 3 లక్షల కార్లు తయారవుతాయి. ప్రపంచ వ్యాప్తంగా 14 ఉత్పత్తి కేంద్రాలు ఉండగా, ఇది 15వది. భారత్‌లో తొలి పరిశ్రమ. భారతీయుల అవసరాలకు వీలైన కార్లు తయారు చేయనున్నారు. 2025 తర్వాత ఇదే ప్లాంట్‌ నుంచి కియా ఎలక్ట్రిక్‌ కార్లను కూడా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

- Advertisement -