కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా రాజీనామా

- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా తన పదవికి రాజీనామా చేశారు. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ)లో ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనుండడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

సెప్టెంబరులో ఆయన ఏడీబీలో బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 31లోగా తనను విధుల నుంచి రిలీవ్ చేయాలని కోరుతూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు పంపిన రాజీనామా లేఖలో అశోక్ కోరారు.

నిజానికి ఆయనింకా రెండేళ్లపాటు విధులు నిర్వర్తించాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ)గా ఉన్న సునీల్ అరోరా ఏప్రిల్ 2021లో పదవీ విరమణ చేయబోతున్నారు.

ఆ తర్వాత అశోక్ లావాసాకే సీఈసీ అవకాశాలు ఉండగా, అంతలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అశోక్‌ను ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఈ ఏడాది జులై 15న ఏడీబీ ప్రకటించింది.

ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న దివకార్ గుప్తా పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది.

- Advertisement -