23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం పుల్వామా ఉగ్రదాడిలో కొత్తకోణం! పాక్ యువతి హనీట్రాప్, చిక్కుకున్న భారత జవాను, ఆ తర్వాతే…

పుల్వామా ఉగ్రదాడిలో కొత్తకోణం! పాక్ యువతి హనీట్రాప్, చిక్కుకున్న భారత జవాను, ఆ తర్వాతే…

- Advertisement -

భోపాల్: పుల్వామా ఉగ్రదాడి ఇంకా భారతీయుల స్మృతిపథం నుంచి తొలగిపోలేదు. ఈ ఉగ్రదాడిలో 40 మందికిపైగా సీఆర్పీఎఫ్ జవాన్లను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు కారణమైన పాకిస్తాన్ భూభాగంలో తిష్టవేసుకుని కూర్చున్న తీవ్రవాదులపై భారత ప్రభుత్వం ప్రతీకారం కూడా తీర్చుకుంది. ఎయిర్ స్ట్రయిక్ ద్వారా ఆ తీవ్రవాదుల శిబిరాలను నామరూపాల్లేకుండా చేసింది.

అయితే పుల్వామా ఉగ్రదాడిలో ఓ కొత్త కోణం తాజాగా వెలుగు చూసింది. కేంద్ర నిఘా సంస్థలు, మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్)ల దర్యాప్తులో ఈ విషయం వెల్లడైంది. పాకిస్తాన్ ఉగ్రవాదులు కశ్మీర్ అవంతిపుర జిల్లాలోని పుల్వామాలో ఉగ్రదాడికి పాల్పడడానికి కారణం ఓ భారత జవాను అని తెలిసి ఉన్నతాధికారులు ఆశ్చర్యపోతున్నారు.

అసలేం జరిగిందంటే…

సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్తాన్ ఐఎస్ఐ.. భారతీయ జవాన్లకు గాలం వేసి.. వారు చిక్కగానే ఉచ్చుబిగిస్తోంది. పుల్వామా ఉగ్రదాడి వెనుక కూడా ఇలాంటి ‘హనీట్రాప్’ ఉంది.

ఐఎస్ఐ ఉచ్చులో భారత జవాను అవినాష్ కుమార్(25) చిక్కుకున్నాడు. ఇందులో ఓ పాకిస్తాన్ యువతి హస్తం ఉందని, సోషల్ మీడియా ద్వారా అతడితో పరిచయం పెంచుకుని, మభ్యపెట్టి అంత్యంత కీలక సమాచారాన్ని తెలుసుకోగలిగారని కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాల దర్యాప్తులో వెల్లడైంది.

మధ్యప్రదేశ్‌.. మోహోలోని బీహార్ రెజిమెంట్‌లో అవినాశ్ కుమార్ నాయక్ క్లర్క్‌గా పని చేసేవాడు. 2018లో అతడిని అసోంకు బదిలీ చేశారు. ఆ సమయంలో వాట్సాప్ ద్వారా అతడికి ఓ పాకిస్తాన్ యువతితో పరిచయం ఏర్పడింది. ఆమె తనను ఓ భారతీయురాలిగా పరిచయం చేసుకుంది.

ఆ పరిచయం ఏ స్థాయికి వెళ్లిందంటే.. చివరికి వారు శృంగారానికి సంబంధించిన విషయాలపై కూడా పరస్పరం చాట్ చేసుకునే స్థాయికి చేరుకుంది. ఆమె వలలో చిక్కుకున్న అవినాష్ కుమార్ ఆమె అడిగిందే తడవుగా ముందు వెనక ఆలోచించకుండా ఆర్మీకి సంబంధించిన పలు విషయాలు చెబుతుండేవాడు. వాటిని ఆమె ఉగ్రవాదులకు అందించేది.

అలా సీఆర్పీఎఫ్ జవాన్ల కదలికలకు సంబంధించి పక్కా సమాచారం అందుకున్న పాకిస్తాన్ జైషే మహ్మద్ సంస్థ ఉగ్రవాదులు కశ్మీర్‌లో దాడికి పక్కా స్కెచ్ గీసి అమలు పరిచారు. దీంతో పుల్వామాలో భీకర ఉగ్రదాడి చోటుచేసుకోవడం, 40 మందికిపైగా భారత జవాన్లు ప్రాణాలు కోల్పోవడం జరిగాయి.

మరోవైపు అవినాష్ కుమార్ బ్యాంకు ఖాతాకు పాకిస్తాన్ నుంచి రూ.50 వేలు జమ అయినట్లు కూడా కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు తమ దర్యాప్తులో గుర్తించాయి.

ఈ నేపథ్యంలో శుక్రవారం అవినాష్ కుమార్‌ను మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు తమ అదుపులోనికి తీసుకున్నారు. అతడ్ని భోపాల్‌లోని ప్రత్యేక జిల్లా కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు.

అంతేకాకుండా అవినాష్ కుమార్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఒక బృందాన్ని అతడు నివసిస్తోన్న ప్రాంతానికి కూడా పంపించారు.

- Advertisement -