అమృత్‌సర్: నవరాత్రి వేడుకల్లో భాగంగా శుక్రవారం స్థానికులు జోదా ఫటక్ ప్రాంతంలోని రైలు పట్టాల సమీపంలో రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఉన్నట్లుండి రైలు దూసుకొచ్చిన ఘటనలో 60 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు తరలిరావడమేకాక, రైలు పట్టాలపై నిలుచుని రావణ దహనం కార్యక్రమాన్ని తిలకించడం పెను విషాదాన్ని సృష్టించింది.
అదే సమయంలో పఠాన్‌కోట్ నుంచి అమృత్‌సర్ వెళుతున్న రైలు అటుగా రావడం, రావణ దహనాన్నితిలకిస్తున్న వారి పైనుంచి దూసుకెళ్లడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
చదవండి: ఘోర ప్రమాదం: జనం పైనుంచి దూసుకెళ్లిన రైలు.. 50 మంది కిపైగా మృతి
ఈ నేపథ్యంలో పంజాబ్ పోలీసులు, రైల్వే భద్రతా సిబ్బంది ప్రమాదానికి కారణమైన డీఎంయూ రైలు డ్రైవర్‌ను లూథియానా రైల్వే స్టేషన్‌లో అదుపులోనికి తీసుకున్నారు. ఈ సంఘటనపై అతన్ని పోలీసులు విచారిస్తున్నారు.
‘‘రైలు ముందుకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఉంది. అందుకే వెళ్లా. ఆ సమయంలో రైలు ట్రాక్‌పై వందలాది మంది నిల్చుని ఉంటారని నేను ఊహించలేదు..’’ అని రైలు డ్రైవర్ బదులిచ్చినట్లు సమాచారం.
ఆ మార్గంలో వెళ్లేందుకు తనకు అనుమతి ఉన్నందువల్లే రైలు ముందుకు పోనిచ్చానని, ఇంతటి దుర్ఘటన జరుగుతుందని ఏమాత్రం ఊహించలేదని చెప్పినట్లు సమాచారం. దీనిపై పంజాబ్ పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ లోకో డ్రైవర్‌ను ప్రశ్నిస్తున్నామని, మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని తెలిపారు.