కాల్ డ్రాప్‌పై ‘ట్రాయ్’ పరీక్ష.. ‘జియో’ తప్ప మిగతా కంపెనీలన్నీ ఫెయిల్!

reliance-jio
- Advertisement -

న్యూఢిల్లీ: కాల్ డ్రాప్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) దేశంలో టెలికాం సేవలు అందిస్తోన్న వివిధ కంపెనీల సామర్థ్యాన్ని ఇటీవల తనిఖీ చేసింది. ట్రాయ్ నిర్వహించిన ఈ పరీక్షలో ముఖేశ్ అంబానీ సారధ్యంలో నడుస్తోన్న ఒక్క ‘జియో’ తప్ప మిగిలిన ప్రముఖ టెలికాం కంపెనీలన్నీ ఫెయిల్ అయ్యాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం!

ట్రాయ్ రిపోర్టు ప్రకారం… ఎంపిక చేసిన జాతీయ రహదారులు, రైల్వే ట్రాకులపై కాల్ డ్రాప్ పరీక్షలు నిర్వహించారు.

మొత్తం కాల్స్‌లో 2 శాతం వాటంతట అవే డిస్ కనెక్ట్ అవుతున్నట్లు ట్రాయ్ గుర్తించింది. మూడు రైలు మార్గాలు, కొన్ని జాతీయ రహదారులపై ఈ పరీక్షలు నిర్వహించిన ట్రాయ్… “కేవలం జియో మాత్రమే నాణ్యమైన సేవలను అందిస్తోంది. జియోలో కాల్ డ్రాప్ రేట్ నిబంధనలకు అనుగుణంగా ఉంది..” అని తన నివేదికలో పేర్కొంది.

పరీక్షలు ఎక్కడెక్కడంటే…

అసన్ సోల్ నుంచి గయ, దిఘా నుంజి అసన్ సోల్, గయ నుంచి దనాపూర్, బెంగళూరు నుంచి మురుదేశ్వర్, రాయ్ పూర్ నుంచి జగ్దల్ పూర్, డెహ్రాడూన్ నుంచి నైనిటాల్, మౌంట్ అబూ నుంచి జైపూర్, శ్రీనగర్ నుంచి లేహ్ వరకూ ఉన్న జాతీయ రహదారులపైనా… అలాగే అలహాబాద్ – గోరఖ్ పూర్, ఢిల్లీ – ముంబై, జబల్ పూర్, సింగ్రౌలీ రైలు మార్గాల్లో ఈ పరీక్షలు నిర్వహించినట్లు ట్రాయ్ తన నివేదికలో వెల్లడించింది.

ఒక్క జియో మాత్రమే…

భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ అందించే 3జీ, 2జీ నెట్ వర్క్ లు నాలుగు జాతీయ రహదారులపై, మూడు రైలు మార్గాల్లో కనీసం బెంచ్ మార్క్‌ను కూడా సాధించలేకపోయాయని ట్రాయ్ తెలిపింది. ఇక టాటా టెలీ సర్వీసెస్ పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉందని, ఈ సంస్థ కనీసం కాల్‌ను కనెక్ట్ చేసే విషయంలోనూ విఫలమైందని పేర్కొంది.

ఇక ఎయిర్ టెల్‌ విషయానికొస్తే.. కాల్ సెటప్ సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉందని, ప్రస్తుతం దేశంలోని అన్ని టెలికాం సంస్థల్లోకెల్లా జియో మాత్రమే వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తోందంటూ ట్రాయ్ కితాబునిచ్చింది.

- Advertisement -