రోజా ‘మై ఎమ్మెల్యే యాప్’ ఆవిష్కరణ.. చంద్రబాబుపై సెల్వమణి తీవ్ర విమర్శలు!

roja-husband-selvamani-chandrababu
- Advertisement -

roja-husband-selvamani-chandrababu

అమరావతి: వైసీపీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి అందరికీ సుపరిచయమే. ఎప్పుడూ రాజకీయపరంగా కామెంట్లు చేయని సెల్వమణి ఉన్నట్టుండి టీడీపీ నేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. 2004 నుంచీ తాను చంద్రబాబును అభిమానించానని, 2014లో ఆయన అసలు నైజం తెలిసి అసహ్యించుకున్నానని వ్యాఖ్యానించారు.

రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్‌తో చేతులు కలిపిన చంద్రబాబుకు సిగ్గు, శరం లేదంటూ రోజా భర్త సెల్వమణి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతేకాదు, వైసీపీ ఎమ్మెల్యేల పట్ల టీడీపీ సరిగా వ్యవహరించడంలేదని అన్నారు. శనివారం తన భార్య రోజా పుట్టినరోజు కావడంతో నగరిలో ‘మై ఎమ్మెల్యే యాప్’ను ప్రారంభించిన అనంతరం సెల్వమణి ఇలా రాజకీయ పరమైన కామెంట్లు చేశారు.

కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ.. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు నిధులు ఇవ్వకుండా వేధిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు.. ప్రజల్లో నమ్మకం కోల్పోయి పొత్తులతో రాజకీయం నెట్టుకొచ్చే రోజులు వచ్చాయని ఆమె వ్యాఖ్యానించారు.

జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయం…

టీడీపీ ఎన్నో విమర్శలు చేస్తూ ఉన్నప్పటికీ వాటిని లెక్కచెయ్యకుండా ప్రజలపై నమ్మకం ఉంచి వైసీపీ నేత జగన్ ముందుకు వెళుతున్నారని, ఆయన్ని ప్రజలు కచ్చితంగా ముఖ్యమంత్రిగా చూస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

‘మై ఎమ్మెల్యే యాప్’ గురించి ప్రస్తావిస్తూ.. ఈ యాప్ ద్వారా తాను చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునని తెలిపారు. పుట్టినరోజును పురస్కరించుకుని పేద ప్రజల కోసం రాజన్న మొబైల్ క్యాంటీన్‌లను ప్రారంభించి, వాటి ద్వారా రూ. 4కే భోజనం అందించనున్నట్టు తెలిపారు. ఇప్పటికి రెండు మొబైల్ క్యాంటీన్లను ప్రారంభించిన రోజా.. భవిష్యత్ లో వాటి సంఖ్య పెంచుతామని హామీ ఇచ్చారు.

- Advertisement -