

బెంగళూరు: కర్ణాటకలో ఏర్పడిన కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో తరచూ విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా, ఆదివారం బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే టి సోమశేఖర మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని విమర్శించారు.
అంతేగాక, ‘అదే సిద్దరామయ్య హయాంలో అయితే, కెంపెగౌడ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు వంటి భారీ పనులు చేశారు’ అని సోమశేఖర్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై సీఎం కుమారస్వామి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతలు హద్దుమీరుతున్నారని అన్నారు.
‘కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాటలను ఆ పార్టీ నేతలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలే తమ ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకోవాలి. హద్దుమీరకుండా చూసుకోవాలి.. లేదా వారు ఇలాగే మాట్లాడతామంటే పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధం. సీఎం కుర్చీపై నాకు మోజు లేదు’ అని కుమారస్వామి స్పష్టం చేశారు.
కుమారస్వామికి కాంగ్రెస్ ఎమ్మెల్యే క్షమాపణ
కాంగ్రెస్ నుంచి అనేక అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తోందని కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంకీర్ణ ధర్మం పాటించడంలో కాంగ్రెస్ విఫలం అవుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రకటనపై కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావ్ స్పందించారు. ఎమ్మెల్యే సోమశేఖర తన పరిధిని అతిక్రమించి మాట్లాడారని అన్నారు. సోమశేఖర తన వ్యాఖ్యలపై కుమారస్వామికి సోమశేఖర క్షమాపణలు చెప్పారని తెలిపారు.
ఈ వ్యవహారంపై మాజీ సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. కుమారస్వామితో చర్చించి విభేదాలను పరిష్కరించుకుంటామని తెలిపారు. కాగా, సిద్దరామయ్య గొప్ప సీఎం అని, ఎమ్మెల్యేలు అలా అనడంలో తప్పు లేదని డిప్యూటీ సీఎం పరమేశ్వర్ వెనకేసుకొచ్చారు. సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా చేసినా వచ్చే నష్టంలేదని బీజేపీ నేత, మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ ఎద్దేవా చేశారు.








