23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం కేంద్రానికే నియంత్రణ: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ సర్కారుకు ఎదురుదెబ్బ

కేంద్రానికే నియంత్రణ: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ సర్కారుకు ఎదురుదెబ్బ

arvind kejriwal-lg
- Advertisement -

arvind kejriwal-lg

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ), విచారణ కమిషన్‌ వంటివి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నియంత్రణలోనే ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే సర్వీసులపై తీర్పులో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ విషయాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు కోర్టు తెలిపింది.

మొత్తం ఆరు అంశాలపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. అవినీతి నిరోధక శాఖపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నియంత్రణ ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేగాక, విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేసే అధికారం కూడా ఎల్‌జీకే ఉంటుందని తేల్చి చెప్పింది. ఇక ఎలక్ట్రిసిటీ కమిషన్‌, విద్యుత్‌బోర్డుపై అధికారం మాత్రం ఢిల్లీ ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొంది.

ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, ఇతర న్యాయ అధికారుల నియామకాన్ని కూడా దిల్లీ ప్రభుత్వమే చేపడుతుందని స్పష్టం చేసింది. అంతేగాక, వ్యవసాయ భూముల ధరలను కూడా ప్రభుత్వమే సవరించుకోవచ్చని తెలిపింది. అయితే, సర్వీసులపై నియంత్రణ ఎవరదన్న అంశంపై న్యాయమూర్తులు మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అధికారుల సర్వీసులు కేంద్ర పరిధిలోకి వస్తాయన్న జస్టిస్ సిక్రీ వాదనతో జస్టిస్ అశోక్ భూషణ్ ఏకీభవించలేదు. దీంతో ఈ అంశంపై త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరుస్తుందని సుప్రీంకోర్టు వెల్లడించింది.

కేంద్ర, రాష్ట్రాలు అవగాహనతో పనిచేయాలి: సుప్రీం

ప్రజా సంక్షేమానికే మొదటి ప్రాధాన్యతనివ్వాలని, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర అవగాహనతో కలిసి పనిచేసి శాంతిని నెలకొల్పాలని కోరింది. కాగా, ఢిల్లీలో అధికారాలపై గత కొంతకాలంగా ప్రభుత్వం, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎవరి ఆదేశాలు పాటించాలి. విచారణ కమిషన్‌ను ఎవరు ఏర్పాటు చేయాలి, రాష్ట్రంలో సర్వీసులను ఎవరు నియంత్రించాలి అన్న దానిపై స్పష్టత కొరవడింది. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరగా.. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా ఈ మేరకు తీర్పు వెలువరించింది.

చదవండి: ‘ఓ మూలకు పోయి కూర్చోండి’: నాగేశ్వరరావుపై సుప్రీం ఆగ్రహం, రూ.లక్ష జరిమానా…

- Advertisement -