29.5 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం ఆర్మీ తొలి ప్రతీకారం: జైషే ఉగ్రవాదులు ఘాజీ రషీద్‌, కమ్రాన్‌ హతం…

ఆర్మీ తొలి ప్రతీకారం: జైషే ఉగ్రవాదులు ఘాజీ రషీద్‌, కమ్రాన్‌ హతం…

Indian-Army-Counter-Attack-to Pulwama-Terror-Attack
- Advertisement -

జమ్మూ కశ్మీర్: పుల్వామా ఉగ్రదాడి విషయంలో భారత సైన్యం తొలి ప్రతీకారం తీర్చుకుంది. సరిహద్దుల్లో నక్కిన పుల్వామా దాడి సూత్రధారి, ఆత్మాహుతి దాడికి పాల్పడిన అదిల్‌కు శిక్షణ ఇచ్చిన రషీద్ ఘాజీని కాల్చి చంపింది. పుల్వామా జిల్లా పింగలాన్‌లోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న సైన్యం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది.

సైనికులను చూసిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ప్రతిగా సైన్యం కాల్పులు జరిపింది. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ఆర్మీ మేజర్ సహా నలుగురు జవాన్లు అమరులయ్యారు. రెండు గంటలపాటు జరిగిన ఈ భీకర ఎన్‌కౌంటర్‌లో చివరికి జైషే కీలక ఉగ్రవాదులు రషీద్ ఘాజీ, కమ్రాన్‌లు హతమయ్యారు.

పుల్వామా దాడి సూత్రధారి…

సైన్యం చేతిలో హతమైన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరైన రషీద్ ఘాజీ పుల్వామా ఆత్మాహుతి దాడికి సూత్రధారి. డిసెంబరులోనే కశ్మీరులో చొరబడిన రషీద్ జేఈఎం చీఫ్ మసూద్ అజర్‌కు అత్యంత సన్నిహితుడు. అత్యాధునిక పేలుడు పదార్థాలను పేల్చడంలో నేర్పరి అయిన ఘాజీ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుంటాడు. పుల్వామా దాడికి పాల్పడిన అదిల్‌కు శిక్షణ ఇచ్చింది కూడా ఇతడే.

పుల్వామా దాడికి మూడు రోజుల ముందు కశ్మీర్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌ నుంచి త్రుటిలో తప్పించుకున్న ఘాజీ 40 మంది భారత సైనికులను పొట్టనపెట్టుకున్నాడు. ఉగ్రవాది అహ్మద్ దార్‌కు శిక్షణ ఇచ్చి పెను విధ్వంసం సృష్టించాడు.

యుద్ధ తంత్రంలో నిపుణుడు…

ఆఫ్ఘనిస్థాన్ యుద్ధంలో పాల్గొన్న ఘాజీ నాటో దళాలకు వ్యతిరేకంగా పోరాడాడు. ఈ క్రమంలో తాలిబన్ల నుంచి పలు యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. ఐఈడీలను పేల్చడంలో శిక్షణ తీసుకుని అందులో నిపుణుడిగా మారాడు. మసూద్ అజర్‌కు విశ్వసనీయుడిగా మారాడు.

మరోవైపు, పుల్వామా ఉగ్ర దాడికి సంబంధించి జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారుగా అనుమానిస్తున్న 23 మందిని సైన్యం అదుపులోకి తీసుకుంది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థకు వీరితో ఏ మేరకు సంబంధాలున్నాయనేదానిపై ఆరా తీస్తోంది.

- Advertisement -