27.2 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ షాకింగ్: మందుకొట్టి పాఠశాలకు వస్తోన్న విద్యార్థినులు, టీసీలు జారీ చేసిన హెడ్మాస్టర్…

షాకింగ్: మందుకొట్టి పాఠశాలకు వస్తోన్న విద్యార్థినులు, టీసీలు జారీ చేసిన హెడ్మాస్టర్…

- Advertisement -

విజయవాడ: తల్లిదండ్రుల అలవాట్ల ప్రభావం పిల్లలపై ఎంతలా పడుతుందనేందుకు ఈ సంఘటన ఓ ప్రత్యక్ష ఉదాహరణ. తన ఎదురుగానే తండ్రి రోజూ మద్యం తాగుతుండడంతో అందులో ఏదో గ‘మ్మత్తు’ ఉందని భావించిన ఇద్దరు అమ్మాయిలు.. తండ్రి తాగగా మిగిలిపోయిన మద్యం చుక్కలు రుచి చూశారు.

వారికి కూడా కొత్తగా అనిపించింది. రోజూ తండ్రి ఎప్పుడు తాగుతాడా అని ఎదురుచూస్తూ.. అదను చూసి మద్యం రుచిచూస్తూ ఆ బాలికలు కూడా తాగుడుకు అలవాటు పడ్డారు. అక్కడితో ఆగలేదు. వారు కూడా దానికి బానిసై రోజూ మందుకొట్టి ఏకంగా స్కూలుకే వెళ్లేవారు. విజయవాడ శివారులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది.

విద్యార్థులు క్లాసు రూములో నిత్యం మత్తులో ఉండడం, తూలి పడుతుండడం, అడిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండడంతో తోటి బాలికలు ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేయడంతో విషయం కాస్తా వెలుగులోకి వచ్చింది.

శనివారం కూడా యథావిధిగా కూల్‌డ్రింకులో మద్యం కలుపుకుని స్కూలుకు తీసుకొచ్చిన తొమ్మిదో తరగతి బాలికలు చున్నీ చాటున గుటకలు వేశారు. అనంతరం పక్కనే కూర్చున్న విద్యార్థులపై తూలిపడ్డారు. వారి నుంచి మద్యం వాసన వస్తుండడంతో తోటి విద్యార్థులు టీచర్లకు ఫిర్యాదు చేశారు.

పరీక్షల్లో తేలిన నిజం…

వారు ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన బాలికలు ఇద్దరికీ పరీక్షలు నిర్వహించారు. వారిద్దరూ మద్యం తాగినట్టు పరీక్షల్లో తేలడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు నివ్వెరపోయారు. వెంటనే వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అంతేకాదు, టీసీ కూడా ఇచ్చి ఇంటికి పంపారు.

బాలికలు ఇద్దరూ గతంలో చదువుకున్న స్కూల్లోనూ ఇలాగే చేస్తే.. అక్కడ కూడా టీసీలు ఇచ్చి పంపించారని ఈ సందర్భంగా హెడ్మాస్టర్ తెలిపారు. తండ్రికి మద్యం తాగే అలవాటు ఉండడంతో సీసాలో మిగిలిన దానిని వీరు తాగేవారని, అది క్రమంగా అలవాటుగా మార్చుకున్నారని చెప్పారు. వారిద్దరి వల్ల తోటి విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే టీసీలు ఇచ్చి పంపినట్టు ఆయన వివరించారు.

- Advertisement -