2019 లోక్‌సభ ఎన్నికలు: ఎవరి పరిస్థితి ఏమిటి? ’274‘ మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే…

Election
- Advertisement -

Election

వచ్చేది ఎన్నికల కాలం.. కేంద్రంలో అధికార బీజేపీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు..

ఇది అందరూ చెప్పేమాట..

అందరూ అంటే..  ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మీడియాలో వస్తున్న వార్తలు, కథనాలు, చర్చల ద్వారా అర్థమవుతున్న సంగతి. 

కానీ అందరూ ఆలోచించాల్సింది ఒకటి ఉంది.. అదే ఢిల్లీ మ్యాజిక్ ఫిగర్.. 274

మొత్తం లోక్ ‌సభ స్థానాలు.. 545

గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కి (534 స్థానాల్లోనే పోటీ జరిగింది) స్వయం సిద్ధంగా  వచ్చినవి 270. సీట్లు.  వారితో జత కట్టిన ఇతర పార్టీలవి 42.. వెరసి మొత్తం 312 సీట్ల బలంతో బీజేపీ అధికార పీఠం ఎక్కగలిగింది.

ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే.. ఆ పార్టీ స్వయంసిద్ధంగా గెలిచినవి..48 సీట్లు మాత్రమే. కాంగ్రెస్‌తో జతకట్టిన ఇతర పార్టీల సీట్లు 5.  మొత్తం కలిపి కాంగ్రెస్ బలం 53 మాత్రమే.

ఇంకా లెక్క తీస్తే.. జనతా పరివార్ నుంచి మరో 6 సీట్లు ఉన్నాయి.  మిగిలిన పార్టీలన్నీకలిసి.. మొత్తం.. 157 సీట్లు. ఇండిపెండెంట్లు..3..  ప్రస్తుతం ఖాళీగా ఉన్నవి..14.. వెరసి 543 పార్లమెంటు స్థానాలు.. ఇదీ గత ఎన్నికల ముఖ చిత్రం.

ఈ నలుగురే కీలకం…

ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఈ నాలుగు పార్టీల అధ్యక్షుల వ్యూహరచనలపై ఎన్నికలు సాగనున్నాయి. 1 అమిత్ షా (బీజేపీ), 2. రాహుల్ గాంధీ (భారత జాతీయ కాంగ్రెస్) 3.  సురవరం సుధాకర్ రెడ్డి ( సీపీఐ) 4.  సీతారాం ఏచూరి (సీపీఐ మార్కిస్టు).. వీరే జాతీయస్థాయి పార్టీలు నేతలుగా ఉన్నారు.

అయితే ఏడు గుర్తింపు పొందిన పార్టీలున్నాయి. కానీ ఆ మూడింటికి ప్రజల్లో జాతీయ స్థాయిలో తగినంత గుర్తింపు లేదు. ఆ పార్టీలేమిటంటే..5. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (మమతా బెనర్జీ)  6. బహుజన్ సమాజ్ పార్టీ (మాయావతి) 7. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్).

కమ్యూనిస్టు పార్టీలను పక్కన పెడితే.. ఇప్పుడు భారతదేశంలో ఉన్నవి రెండే ప్రధాన పార్టీలు.. 1. బీజేపీ (భారతీయ జనతా పార్టీ) 2. భారత జాతీయ కాంగ్రెస్.. బహుశా 2019 ఎన్నికల్లో  ఈ రెండు ప్రధాన పార్టీలకు ప్రభుత్వాన్ని నిలబెట్టే సింగిల్ మెజార్టీ ఫిగర్ రాకపోవచ్చు.. కారణం…

ఇంకా పుంజుకోని కాంగ్రెస్ ..

ప్రస్తుతం భారతదేశంలో కాంగ్రెస్ కేవలం ఐదు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. కొన్నిచోట్ల మిత్రపక్షాలు ఉన్నా.. స్వయంగా అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, పుదుచ్చేరి ఇవన్నీ అతి చిన్న రాష్ట్రాలు కాగా.. ఆ మధ్య పంజాబ్‌లో గెలిచింది.

ఇటీవల కర్ణాటకలో ‘చావుతప్పి కన్నులొట్ట పోయినట్టు’గా కుమారస్వామితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇంత దారుణాతి దారుణంగా ఉన్న కాంగ్రెస్.. మరో ఆరునెలల్లో ఎలా విజయం సాధిస్తుందనేది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న.

అయితే ఎవరు చెప్పినా చెప్పకపోయినా.. తమ పరిస్థితిపై వారి అంచనాలు వారికి ఉంటాయి కాబట్టి.. కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే ఎన్నికల ప్రణాళికల్లో చురుగ్గా అడుగులు వేస్తోంది. అప్పుడే కార్యాచరణలోకి కూడా దిగిపోయింది.

నవంబర్ 13న  ఢిల్లీలో కాంగ్రెస్ విందు…

బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను, ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే  కార్యాచరణను  కాంగ్రెస్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో నవంబరు 13న రాజకీయ విందు ఏర్పాటు చేశారు. సోనియాగాంధీ అధ్యక్షతన  ఢిల్లీలో ఈ విందు సమావేశం జరగనుంది.

దీనికి తమిళనాడు డీఎంకే పార్టీ నేత స్టాలిన్‌ను ఫొన్ ద్వారా సోనియా గాంధీయే స్వయంగా ఆహ్వానించారు.  అలాగే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి, ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ఆహ్వానాలు అందాయి..

13 రాష్ట్రాల్లో అధికారంలో బీజేపీ…

మద్దతిచ్చే ప్రాంతీయ పార్టీలతో కాకుండా.. స్వయంగా 13 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. తమిళనాడులోని అన్నాడీఎంకే లాంటి పార్టీల సహకారం ఉంది. ఇంకా కర్ణాటకలో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. తాజాగా తెలంగాణలో టీఆర్ఎస్ కూడా ఆ పార్టీకి  మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీ..  కాంగ్రెస్‌వైపు ఉంది కాబట్టి, కేవలం ప్రత్యేక హోదా డిమాండ్ ఆధారంగా వైఎస్సార్సీపీ.. బీజేపీ వైపు.. అదీ ఆ పార్టీ గెలుపు అనంతరం మద్దతిచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.  ఒక రకంగా చెప్పాలంటే మద్దతిచ్చే వాటితో కలిపి 20 రాష్ట్రాలపైనే బీజేపీ అధికారంలో ఉన్నట్టే. ఎందుకంటే ప్రస్తుతం 270 స్థానాలతో పటిష్టంగా ఉన్న బీజేపీకి అలయిన్స్ లో 42 సీట్ల వరకు మద్దతిస్తున్నారు.

ఒకవేళ వచ్చే ఎన్నికల్లో బీజేపీకిి సీట్ల సంఖ్య తగ్గినా.. ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండటం కలిసి వస్తుందని.. ఈ నేపథ్యంలో మరొక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోనవసం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే తాజాగా బయటికొచ్చిన రాఫెల్ కుంభకోణం, పార్టీ ఎంపీలు కొందరు వ్యక్తిగతంగా చేసిన తప్పిదాలు ఎంతవరకు బీజేపీపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయనే అంశం కూడా ఆలోచించాల్సిందే. మరోవైపు ప్రజా వ్యతిరేక పథకాలు ఇందుకు తోడవ్వచ్చు.

మరొక విషయం ఏమిటంటే.. కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ తీసుకొచ్చిన కొన్ని పథకాల లబ్ది..ప్రజలకు అందుతున్నా.. ప్రాంతీయ పార్టీల ముసుగులో అవి తెరపైకి రాకపోవడంతో కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీ పాగా వేయలేకపోతోంది.

పరిస్థితి అనుకుంటున్నంత సులువేం కాదు… 

గత ఎన్నికల్లో ముగ్గురే స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు.  దీంతో వారి  పాత్ర నామమాత్రమే.. అయితే 157 స్థానాలతో నిండుగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఏకం చేయగలిగితే.. వారు మద్దతిచ్చే వారితో ప్రధాన పార్టీలు అధికారం కైవసం చేసుకోగలవు. ఇది సత్యం. ప్రస్తుతం బలోపేతంగా కనిపిస్తున్న బీజేపీని ఎదుర్కోవాలంటే.. అందరూ కలిసి పోరాడితేనే ఫలితం ఉంటుందనే  వ్యూహంతోనే కాంగ్రెస్ అలయెన్స్ కలిసి ముందుకు సాగుతున్నారు.

ఒకవేళ వంద సీట్లులోపు వస్తే.. కాంగ్రెస్ పీఎం పీఠాన్ని త్యాగం చేస్తుందా?

బీజేపీ వ్యతిరేక గాలి వీస్తే.. ఆ ఊపులో కాంగ్రెస్ గెలవాలి. కానీ అంత లేదు కాబట్టి.. ప్రభుత్వ వ్యతిరేకత, సంప్రదాయ ఓటు బ్యాంకు ఆధారంగా గెలిస్తే.. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి 100లోపే సీట్లు వస్తే… ప్రధానిమంత్రి పదవిని రాహుల్ గాంధీకి కాకుండా ప్రస్తుతం డిమాండ్ చేస్తున్న మమతా బెనర్జీ లేదా మాయావతిలాంటి వారికి ఇస్తారా? అనేది ఒక ప్రశ్న..

అయితే తనకు ప్రధాని పదవిపై ఆశ లేదని ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రకటించినా.. ఆ పార్టీకి 120- 150 సీట్లు వస్తే.. అప్పుడు రాహుల్ గాంధీకే న్యాయబద్ధంగా ఆ పదవి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పరిస్థితుల్లో.. మాయావతి, మమతా బెనర్జీ పీఎం పీఠం కోసం గొడవ పెట్టరని గ్యారంటీ ఉందా?

మమతాని ఒప్పించవచ్చుగానీ, మాయావతి విషయంలో సాధ్యం కాకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో చొరవ చూపిస్తున్న చంద్రబాబు ఎంతవరకు ఈ సమస్యని పరిష్కరిస్తారనేది ఒక ప్రశ్న… ఇదే సమస్య బీజేపీలో కూడా ఉందండోయ్..

బీజేపీ అధికారంలోకి వస్తే.. ఈసారీ మోదీ ప్రధాని అవుతారా?

ఈ ప్రచారం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీపై ప్రజలకు అభిమానం ఉంది. కానీ ఒంటెద్దు పోకడలు, నేనే మోనార్క్ ని, నా మాటే వినాలనే మొండితనం, సీనియర్లను గౌరవించకపోవడం లాంటి అభియోగాలతో..మోదీని మళ్లీ ప్రధానిని చేయరంటూ ఆ పార్టీలోనే ఒక వర్గం గట్టిగానే ప్రచారం చేస్తోంది.

ఈసారి బీజేపీ గెలిస్తే.. అమిత్ షా లేదంటే నితిన్ గడ్కరీ లాంటి వాళ్లకు ఛాన్స్ ఇస్తారనే ప్రచారం కూడా ఉంది. ఇలా రెండు ప్రధాన పార్టీల్లో ప్రధాని పదవిపై స్పష్టత లేకపోవడం.. భవిష్యత్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

ఎందుకంటే పూర్తి మెజార్టీతో ప్రధాని అయితే ఫర్వాలేదు. అరకొర మెజార్టీతో వస్తే మాత్రం.. భారత దేశ ప్రగతికి విఘాతం కలుగుతుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. అందుకని ఔత్సాహిక ప్రజలు..మీ అంతరాత్మ ప్రబోధానుసారం..అంత:కరణ శుద్ధితో.. భయంగానీ, పక్షపాతంగానీ లేకుండా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి.

సర్వేలు.. బీజేపీ వైపే…

ఇవన్నీ పక్కన పెట్టండి.. దేశంలో ప్రతిష్టాత్మకమైన ఏబీపీ న్యూస్- సీఎస్‌డీఎస్ సర్వే ప్రకారం.. కేంద్రంలో  మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది. వాళ్లు పలు అంశాల్లో  19 రాష్ట్రాల్లో సర్వే చేయగా.. చాలా రాష్ట్రాల్లో బీజేపీ పాలననే సమర్థిస్తూ ఓటు వేశారు.

అందులోనూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.. 545 సీట్లకు.. ఎన్డీఏ 274, కాంగ్రెస్  164,  ఇతరులు 105 విజయం సాధిస్తారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి పాపులారిటీ విషయానికి వస్తే గతంతో పోల్చితే కొంచెం తగ్గి 37 శాతం దగ్గర ఆగింది.

రాహుల్ గాంధీకి ఆదరణ కొంచెం పెరిగి ప్రస్తుతం 24 శాతంగా ఉంది. మొత్తమ్మీద 19 రాష్ట్రాల్లో 60 శాతం ఎన్డీఏను సమర్థిస్తుండగా..యూపీఏను 34 శాతం అభిమానిస్తున్నారు. ఇతరులు 6 శాతంగా ఉన్నారు. ఇదండీ కేంద్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాల సంగతులు..

-శ్రీనివాస్ మిర్తిపాటి

- Advertisement -