పాక్ టీ స్టాల్ ముందు భారత పైలట్ అభినందన్ ఫొటో: ఏం రాశారో తెలుసా?

IAF pilot Abhinandan's photo with a special message, Newxpressonline
- Advertisement -

ఇస్లామాబాద్‌: ఇది వినడానికి కొంత ఆశ్చర్యకరమైన విషయమే అయినప్పటికీ ఆసక్తికరంగా ఉంది. పాకిస్థాన్‌లోని ఓ వ్యక్తి తన టీ దుకాణం ముందు భారత వైమానిక దళ(ఐఏఎఫ్‌) వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ ఫొటోను పెట్టుకున్నాడు. దానికి ఓ సందేశాన్ని జోడించి తన వ్యాపారాన్ని ప్రచారం చేసుకుంటున్నాడు. ఇది స్థానికంగా ఆకర్షణీయంగా మారింది.

జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన అనంతరం.. పాక్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మహ్మద్‌ ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత సరిహద్దులోకి వచ్చిన పాక్‌ యద్ధ విమానాలను తరిమికొట్టేందుకు.. ఓ యుద్ధ విమానంలో అభినందన్ బయల్దేరాడు. పాక్ యుద్ధ విమానాన్ని నేల కూల్చాడు.

శత్రువులను కూడా మిత్రులుగా మార్చే టీ…

అయితే, అభినందన్ ప్రయాణించిన విమానం కూడా కూలడంతో పీవోకేలో పాక్‌ జవాన్లకు చిక్కారు. అనంతరం రెండ్రోజుల తర్వాత ఆయనను పాక్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌లోనే కాకుండా అభినందన్‌కు అంతర్జాతీయంగా పేరు వచ్చింది. పాక్‌ ఆర్మీ ముందు ఆయన చాలా ధైర్యంగా వ్యవహరించిన తీరు, వారు ప్రశ్నలు అడిగితే… సమాధానాలు చెప్పిన తీరుపై ప్రశంసలు కురిశాయి. పాక్ అధికారులు అందించిన టీ బాగుందని కూడా ఈ సందర్భంగా అభినందన్ వ్యాఖ్యానించారు. దీంతో పాక్ ప్రజల్లోనూ ఆయన మంచి పేరు తెచ్చుకున్నట్లున్నారు.

అందుకే, పాక్‌కు చెందిన ఈ టీ దుకాణ వ్యాపారి.. బ్యానర్‌లో అభినందన్‌ ఫొటోను పెట్టుకుని దానిపై ‘ శత్రువులను కూడా మిత్రులుగా మార్చే టీ ఇక్కడ దొరుకుతుంది’ అని రాయించాడు. దీంతో ఆయన చాలా ఫేమస్‌ అయిపోయాడు. కొందరు ఇందుకు సంబంధించిన ఫొటోలను తమ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ టీ అంకుల్ మార్కెటింగ్ స్కిల్స్ ఎంబీఏ వాళ్లను కూడా వెనక్కి నెట్టాయంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

 

- Advertisement -