పుదుచ్చేరి: మన ఇంట్లో చెత్తను బయటపారేయడానికే మనం బద్ధకిస్తుంటాం. అదే చెత్త మనం వెళ్లే వీధిలో రోడ్డుకు అడ్డంగా ఉన్నా సరే మనం ముక్కుమూసుకుని పక్కకు తప్పుకుని వెళ్లిపోతాం తప్ప..దాని జోలికి మాత్రం వెళ్లం. కానీ ఈ ముఖ్యమంత్రి సంగతే వేరు. డ్రైనేజీలోకి దిగడమేకాదు భరించలేని దుర్వాసన వస్తున్నా… పట్టించుకోకుండా లోపల ఉన్న చెత్తను పారతో తీసి బయట పారవేశాడు.
ఇంతకీ ఈయన ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఏం ఆ పని చేయడానికి ఆయనే దిగాలా? ఆ రాష్ట్రంలో పారిశుధ్య కార్మికులు లేరా? ఇలాంటి ప్రశ్నలేమీ అడక్కండి. సాక్షాత్తు ముఖ్యమంత్రే స్వయంగా ఈ పని చేస్తే.. మిగిలిన అధికార గణానికి వణుకు పుట్టదా? అదే ఆ వణుకు పుట్టాలని ఆయన ఈ పని చేశాడు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి పని చేశాడంటే అది సంచలనమే కదా! ముఖ్యంగా సోషల్ మీడియా జనం ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడవచ్చు.
అసలు కథ ఏమిటంటే..
దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో గత నెలలో ప్రధాని మోడీ ‘స్వచ్ఛతా హి సేవా’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంతో గాంధీ జయంతి రోజున దేశ వ్యాప్తంగా నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే కోవలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి కూడా ‘స్వచ్ఛతా హి సేవ’ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
అందులో భాగంగానే ఆయన అలా మురుగు కాలువలోకి దిగి అందులోని చెత్తను తీసి బయట వేశారు. ఇది మీడియా కంట పడింది. ఇంకేముంది ఒక్కసారిగా హైలైట్ అయిపోయింది. మంచి సందర్భం చూసుకుని పేరు తెచ్చుకోవడం కోసమే ఆ ముఖ్యమంత్రి ఇలా చేసి ఉంటాడని మాత్రం మీరు అనొద్దు… అసలు పేరు కోసమైనా ఇలాంటి పనులు చేసే నాయకులు ఎక్కడున్నారు మనకు?
#SwachhataHiSeva #SwachhBharat #SwachhBharatMission cleaning at #Nellithope #Puducherry pic.twitter.com/FkeKvfClZK
— V.Narayanasamy (@VNarayanasami) October 1, 2018