లగడపాటి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన న్యాయవాది

Lagadapati Rajgopal Latest News, AP Political News, AP Assembly News, Newsxpressonline
- Advertisement -

విజయవాడ: ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించబోతోందని, తన సర్వేలో అదే తేలిందని చెప్పిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై చర్యలు తీసుకోవాలంటూ కొవ్వూరుకు చెందిన సీనియర్ న్యాయవాది పిల్లలమర్రి మురళీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆయన సర్వేను నమ్మి ఎంతోమంది లక్షలాది రూపాయలను పోగొట్టుకున్నారని పోలీసులకు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు. తన సర్వేకు మీడియాలో విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా బెట్టింగులకు పురికొల్పారని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలపై తప్పుడు సర్వే నిర్వహించిన లగడపాటిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

బెట్టింగులకు ప్రోత్సహించారు
లగడపాటి సర్వేపై విశ్వాసంతో ప్రజలు కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నారని, దీనిపై సమగ్ర విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని మురళీ కృష్ణ డిమాండ్ చేశారు. సర్వే వెనక అంతర్జాతీయ మాఫియా ఉందన్న అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. స్వచ్ఛంద సంస్థలు, విశ్లేషకులు, పోలీసులు, మానవతావాదులు, మానవ హక్కుల సంఘాలు బెట్టింగ్ నిర్మూలనకు సహకరించాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడటానికి సరిగ్గా మూడు రోజుల ముందు లగడపాటి తన ఆర్జీ ఫ్లాష్ సర్వే ఫలితాలను వెల్లడించారు. ఏపీలో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వమే రాబోతోందని టీడీపీ 110 స్థానాలకు అటూఇటుగా సొంతం చేసుకుంటుందని రాజగోపాల్ పేర్కొన్నారు. అయితే, లగడపాటి అంచనాలు పూర్తిగా తప్పయ్యాయి. జగన్ సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 151 స్థానాలను కైవసం చేసుకుని వైసీపీ ప్రభంజనం సృష్టించింది.

- Advertisement -