ఉత్తరాంధ్రకు సమీపంలో ఫోని! శ్రీకాకుళం జిల్లాకి పొంచి ఉన్న పెనుముప్పు !

super saiclone foni latest update
- Advertisement -

శ్రీకాకుళం: సూపర్ సైక్లోన్ ఫొని పంజా విసిరింది. ఉత్తరాంధ్ర సహా ఒడిశా తీరాన్ని ముంచేత్తేందుకు వేగంగా తీరం వైపు దూసుకొస్తోంది. మే 2 , 3 న ఉత్తరాంధ్రలోని విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సమీపంగా ప్రయాణించనుంది. బుధవారం రాత్రి విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 320 కి.మీ.దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది.

నేడు విశాఖ తీరానికి సుమారు 130-140 కిలోమీటర్ల దూరంలో తీరానికి సమాంతరంగా ప్రయాణించవచ్చని వాతావరణశాఖ అధికారాలు అంచనా వేస్తున్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాకు 40-50 కిలోమీటర్ల దూరం నుంచే ఒడిశావైపు ప్రయాణించనుంది.
ఉత్తరాంధ్ర తీరానికి తుఫాన్ సమీపంగా రావడంతో శ్రీకాకుళం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ముఖ్యంగా టెక్కలి, ఇచ్ఛాపురం నియోజకవర్గాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీ ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి.

దీనితో సముద్రం వైపుకి ఎవరు రావొద్దు అని అధికారులు హెచ్చరికలు జారీచేస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పెను తుఫాన్‌గా కొనసాగుతోంది ఫొని. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 320 కి.మీ., పూరీకి 570 కి.మీ. దూరంలో కేంద్రీ కృతమై ఉంది. గంటకు 16కి.మీ వేగంతో ఉత్తర ఈశాన్యం దిశగా కదులుతున్న ఫొని తుఫాన్, శుక్రవారం మధ్యాహ్నం ఒడిశాలోని గోపాల్‌పూర్-చాంద్‌బలి మధ్య తీరం దాటే అవకాశముంది. తుఫాన్ తీరం దాటే సమయంలో శ్రీకాకుళంతో పాటు ఒడిశా తీరంలో గాలుల వేగం 170 – 200 కిలోమీటర్ల మధ్య ఉండవచ్చు.

విజయనగరం, విశాఖ జిల్లా తీరాల్లో గంటకు 90 -115 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల వీచే అవకాశముంది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో పాటు ఒడిశాలోని కెంద్రపర, భద్రక్‌, జాజ్‌పుర్‌, బాలసోర్‌ జిల్లాలపై పొని తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. అటు పశ్చిమబెంగాల్‌లోని తూర్పు, పశ్చిమ మిడ్నాపూర్, దక్షిణ, ఉత్తరంలోని 24 పరగణాలు, హౌరా, హుగ్లీ, కోల్‌కతా సహా 19 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని భారతవాతావరణ విభాగం వెల్లడించింది.

- Advertisement -