చంద్రబాబు మూడు ప్రతిపాదనలు.. ఏకీభవించిన సోనియా!

chandrababu-meets-sonia-gandhi
- Advertisement -

న్యూఢిల్లీ: అటు లోక్‌సభ, ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైనా, అవి ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని ఏమాత్రం ప్రభావితం చేసినట్లు కనిపించడం లేదు. అవి ప్రతికూల ఫలితాలే వెల్లడించినా ఆయన ఏమాత్రం లెక్కచేయడంలేదు. ఎన్డీయేతర పక్షాలు ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయంపైనే చంద్రబాబు దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం సాయంత్రం యూపీఏ అధినేత్రి సోనియా గాంధీతో కూడా భేటీ అయ్యారు. తొలిసారి ఢిల్లీలోని 10 జన్‌పథ్‌లోని సోనియా నివాసానికి వెళ్లిన బాబు ఆమెతో దాదాపు 40 నిమిషాలపాటు సమావేశమై జాతీయ రాజకీయాల గురించి చర్చించారు. అంతకుముందు ఆయన రాహుల్ గాంధీ, శరద్ పవార్‌లతో కూడా సమావేశమయ్యారు.

ఈ సమావేశాల్లో ప్రధానంగా ఎన్డీయేతర పక్షాలు ఎలా ముందుకెళ్లాలన్న విషయమై చర్చించారు. శనివారం ఎస్పీ, బీఎస్పీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్, మాయావతిలతో జరిపిన చర్చల వివరాలను కూడా చంద్రబాబు వారికి వివరించారు.

ఇక సోనియా గాంధీతో జరిపిన చర్చల్లో.. ఈనెల 23న వెలువడే ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయేతర పక్షాలకు వచ్చే సీట్ల గురించి చర్చించారు.

సోనియా ఎదుట మూడు ప్రతిపాదనలు…

ఈ సంఖ్యా బలం ఆధారంగా వ్యూహాత్మకంగా ముందడుగు వేయడానికి చొరవ తీసుకోవాల్సిందిగా సోనియాగాంధీకి బాబు సూచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోనియా ఎదుట ఆయన మూడు ప్రతిపాదనలు ఉంచినట్లు సమాచారం.

ఎన్డీయేతర పక్షాలన్నీ ఒక్కతాటిపై ఉంటాయనే సందేశాన్ని బలంగా వినిపించాలని, ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కనుక విపక్షాలకు వచ్చేట్లు అయితే ఎన్డీయేతర పక్షాలన్నీ ఒక్కటై.. ప్రభుత్వ ఏర్పాటుకు తమనే ఆహ్వానించే విధంగా రాష్ట్రపతికి ముందుగానే ఓ లేఖ ఇచ్చేందుకు ప్రయత్నించాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.

ఇక మూడో మార్గంగా.. ఇప్పటివరకు ఏ కూటమిలోనూ లేని, తటస్థంగా ఉన్న పార్టీలను బీజేపీ వ్యతిరేక కూటమిలోకి వచ్చేలా ప్రయత్నాలు చేయాలని చంద్రబాబు సూచించారని, ఈ మూడు ప్రతిపాదనలకు సోనియా కూడా ఏకీభవించారని సమాచారం.

అయితే 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత దీనిపై కార్యాచరణ ప్రారంభిద్దామని సోనియా అభిప్రాయం వ్యక్తం చేయగా, అంతవరకు కూడా వేచి చూడకుండా ముందుగానే కార్యాచరణ ప్రారంభించాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.

మొత్తంగా చూస్తే.. ఇప్పటి వరకు జరిగిన చర్చలన్నీ ఆయా పార్టీల, నాయకుల అభిప్రాయాలు తెలుసుకోవడం వరకే పరిమితమయ్యాయి తప్ప అంతకుమించి సాధించిందేమీ కానరావడం లేదు. అయితే ఎన్నికల ఫలితాల విడుదలకు సమయం దగ్గరపడడంతో ఇప్పుడిప్పుడే ఆయా పార్టీల నేతలు కూడా తమ మనోభావాలు వ్యక్తం చేస్తున్నారు.

అందరి అభిప్రాయాలు తీసుకుని వాటి ఆధారంగా ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం సాధించేందుకు చంద్రబాబు క‌ృషి చేస్తున్నారు.

ఇక సోమవారం సాయంత్రం మాయావతిగాని, లేదంటే మమతా బెనర్జీగాని ఢిల్లీకి వచ్చే అవకాశం ఉందని తెలియడంతో.. వారితో మళ్లీ ఒకసారి సమావేశం అవ్వాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారని, ఈ నేపథ్యంలో ఆయన సోమవారం మరోమారు ఢిల్లీ టూర్‌కు వెళ్లనున్నారని తెలుగుదేశం వర్గాలు పేర్కొంటున్నాయి.

- Advertisement -