సింగపూర్: ఎంతోకాలంగా ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఘట్టం ఎట్టకేలకు చోటుచేసుకుంది. అది.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ల భేటీ. వీరిద్దరి భేటీ ఎట్టకేలకు మంగళవారం సింగపూర్‌లో అత్యంత సానుకూల వాతావరణంలో జరిగిపోయింది. ఇరు దేశాధినేతల మధ్య జరిగిన శిఖరాగ్ర సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా కొరియా ద్వీపకల్పంలో అణునిరాయుధీకరణ, శాంతిస్థాపనే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరిగింది. అంతేకాదు, ఈ భేటీపై ఇటు ట్రంప్, అటు కిమ్ కూడా సంతృప్తి వ్యక్తంచేశారు. అత్యంత అరుదైన ఈ భేటీకి సింగపూర్ సెంటోసా దీవిలోని కేపెల్లా హోటల్ వేదికగా మారింది.
ట్రంప్, కిమ్ కరచాలనం…
తొలిసారిగా కలుసుకున్న సందర్భంగా ట్రంప్, కిమ్ 12 సెకన్ల పాటు కరచాలనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ చాలాసేపు చప్పట్లు కొడుతూ సంతోషాన్ని వ్యక్తంచేశారు. తర్వాత తమ జాతీయ జెండాల వద్ద నిల్చొని ఫొటోలకు పోజులిచ్చారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ముచ్చటించుకున్న తర్వాత ట్రంప్.. హోటల్ లైబ్రరీ వైపు కిమ్‌కు దారి చూపించారు. ఇద్దరూ కలిసి కారిడార్‌లో నడచుకుంటూ లోపలికి వెళ్లారు.
ఏడు నిమిషాల ముందే కిమ్…
పెద్దవారిని కలిసేందుకు వెళ్తున్నప్పుడు ముందే చేరుకోవాలన్న కొరియన్ సంప్రదాయం ప్రకారం 34 ఏండ్ల వయసున్న కిమ్ ఏడు నిమిషాల ముందుగానే కెపెల్లా హోటల్‌కు చేరుకున్నారు. ఇక 71 ఏండ్ల ట్రంప్.. కొరియన్లకు ఎంతో ఇష్టమైన ఎరుపురంగు టైని ధరించి చర్చలకు వచ్చారు. ద్వైపాక్షిక చర్చల్లోనే ఇరువురు నేతలు విందును కూడా పూర్తి చేశారు. సమావేశం అనంతరం ట్రంప్ సింగపూర్ నుంచి స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో గ్వామ్‌లోని అమెరికన్ బలగాలను ఆయన కలుసుకుంటారని, అక్కడినుంచి వాషింగ్టన్ చేరుకుంటారని అధికారులు తెలిపారు.
కొరియా ద్వీపకల్పంలో సంపూర్ణ అణునిరాయుధీకరణకు అంగీకరించిన ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. బదులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి భద్రతతోపాటు పలు ప్రయోజనాలపై హామీలను పొందగలిగారు. ‘‘ఇరువురం నిజాయితీగా అభిప్రాయాలను పంచుకున్నాం..’’ అని భేటీ అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ట్రంప్, కిమ్ తెలిపారు. ఉతర కొరియాకు తగిన భద్రతాపరమైన భరోసాను కల్పించేందుకు ట్రంప్ హామీ ఇవ్వగా, సంపూర్ణ అణునిరాయుధీకరణకు కట్టుబడి ఉంటామని కిమ్ ప్రకటించినట్లు సంయుక్త ప్రకటన వెల్లడించింది. యుద్ధఖైదీలను, గల్లంతైన వారిని పరస్పరం అప్పగించుకోవడంతోపాటు యుద్ధనేరస్థుల్ని వారి స్వదేశాలకు పంపే ఒప్పందానికి ఇరు దేశాధినేతలు అంగీకరించారు.
చరిత్రలోనే కీలక ఘట్టం…
1950-53 కొరియా యుద్ధం తర్వాత అమెరికా, ఉత్తర కొరియా శత్రుదేశాలుగా మారాయి. ఈ రెండు దేశాల అధ్యక్షుల మధ్య చర్చలు కాదుగదా కనీసం ఫోన్లో కూడా నేతలు మాట్లాడుకోలేదు. తొలిసారిగా ఇప్పుడు ఇరుదేశాధినేతలు భేటీ కావడం ప్రపంచ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా మిగిలిపోనుంది. అనేక మలుపులు, ఆసక్తికర పరిణామాల తర్వాత ఉత్తర కొరియా అధినేత, అమెరికా అధ్యక్షుడు చర్రితలోనే తొలిసారిగా ముఖాముఖి చర్చలు జరిపారు. పలు కీలక అంశాలు వారిమధ్య చర్చకు వచ్చాయి. అనువాదకుల సమక్షంలో డొనాల్డ్ ట్రంప్, కిమ్‌జోంగ్ ఉన్ దాదాపు 45 నిమిషాలపాటు ముఖాముఖి సమావేశమయ్యారు. అనంతరం తమ దౌత్యాధికారులతో కలిసి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య నూతన స్నేహ సంబంధాలను నెలకొల్పడంతోపాటు కొరియన్ ద్వీపకల్పంలో శాశ్వత శాంతిస్థాపనకు సంబంధించిన సమస్యలపై విస్తృత, లోతైన చర్చలు జరిగాయి.
కిమ్‌కు ‘సినిమా’ చూపించిన ట్రంప్…
శాంతితో ఎటువంటి పురోగతిని సాధించవచ్చో వివరిస్తూ ఒక హాలీవుడ్ తరహా వీడియోను అధ్యక్షుడు ట్రంప్ ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు చూపించారు. ఆ వీడియోలో ప్రధాన పాత్రలుగా ట్రంప్, కిమ్‌లను చూపించారు. ప్రచ్ఛన్నయుద్ధం నాటి ప్రత్యర్థుల మధ్య శాంతి నెలకొంటే ఆ ప్రయోజనాలు ఎలా ఉంటాయో నాటకీయ ఫక్కీలో ప్రదర్శించారు. ‘ఇద్దరు నేతలు, ఒకే గమ్యం’ పేరిట సాగిన కథనంలో ఉత్తరకొరియా తన అణ్వాయుధాలను నిర్మూలించడం వల్ల కలిగే లాభాలెలా ఉంటాయో వివరించారు. ఈ వీడియోను ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తోపాటు ఆయన ఎనిమిది మంది సహచరులు కూడా వీక్షించారు. మీడియా సమావేశంలో ఈ వీడియో గురించి ట్రంప్‌ను ప్రశ్నించగా, ‘‘అవును ఆ వీడియోను మేమే రూపొందించాం.. దానిని ఆయన(కిమ్)కు చూపించాం.. ఆయనకు బాగా నచ్చి ఉంటుంది..’’ అని వ్యాఖ్యానించారు. తన ప్రజల దృష్టిలో వీరునిగా ఉన్న కిమ్ తాను తలచుకుంటే మునుపెన్నడూ లేనటువంటి పురోగతిని సాధించవచ్చునని ఆ వీడియో చివరలో ఓ వ్యాఖ్యానం కూడా ఉంది.
చర్చలు ఫలప్రదం…
అమెరికా, ఉత్తరకొరియా మధ్య మంగళవారం జరిగిన శిఖరాగ్ర చర్చలు ఫలప్రదమయ్యాయి. సమావేశం అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ‘కిమ్‌తో భేటీ వెరీ వెరీ గుడ్.. చాలా సానుకూలంగా జరిగింది.. అందరూ ఊహించిన దానికంటే అద్భుతంగా జరిగిందని నేను అనుకుంటున్నా.. చర్చలు సూటిగా, నిజాయితీగా, ఫలితాలనిచ్చేవిగా జరిగాయి.. ఈ చర్చల వల్ల మున్ముందు చాలా పురోగతి చోటుచేసుకుంటుంది.. ఉత్తర కొరియా కోరినట్లుగానే ఇకపై దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాలను అమెరికా జరుపబోదు.. దక్షిణ కొరియాలోని సైనికబలగాలను కూడా అమెరికా ఉపసంహరించుకుంటుంది.. అయితే గతంలో అణుపరీక్షల సందర్భంగా ఉత్తర కొరియాపై విధించిన ఆంక్షలు మాత్రం ప్రస్తుతానికి అలాగే ఉంటాయి..’’ అని ట్రంప్ తెలిపారు.
జర్నలిస్టుల కోసం…
ట్రంప్-కిమ్ మధ్య సింగపూర్‌లో జరిగిన చారిత్రక శిఖరాగ్ర సమావేశాన్ని కవర్ చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 3,000 మంది జర్నలిస్టులు సింగపూర్‌కు చేరుకున్నారు. వీరికి వడ్డించేందుకు తయారు చేసిన వంటకాలలో పులావ్, చికెన్ కుర్మా, చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, దాల్, పాపడ్ లాంటి భారతీయ వంటకాలు ఉన్నాయి. స్థానిక, విదేశీ జర్నలిస్టులకు ఆహారం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఎదురవకుండా చూసేందుకు 15 హోటళ్లలో 45 రకాల వంటకాలను తయారు చేయించారు. జర్నలిస్టుల మెనూలో… భారత్‌తో పాటు సింగపూర్, మలేసియా, వియత్నాం, థాయిలాండ్, కొరియా, జపా న్, చైనా, ఫ్రాన్స్, అమెరికన్, ఇటాలియన్, ఇంగ్లీష్ వంటకాలు కూడా ఉన్నాయి.
ఇక ట్రంప్ దృష్టి ఇరాన్‌పైనే…
తన అణు క్షిపణి పరీక్షలతో ప్రపంచాన్ని గజగజలాడించిన ఉత్తరకొరియా అధినేత కిమ్‌ను ఎట్టకేలకు తన దారికి తెచ్చుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇక ఇరాన్‌పై దృష్టి సారించారు. ఇరాన్‌తో కూడా తమ సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. సింగపూర్‌లో కిమ్ జోంగ్ ఉన్‌తో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తగిన సమయంలో ఇరాన్‌తో కూడా సంబంధాలు మెరుగుపడుతాయి. అందుకు సరైన సమయం రావాలి. ప్రస్తుతానికి ఆంక్షలు అమలవుతున్నాయి. మా ఆంక్షలు చాలా కఠినంగా ఉన్నాయి. వారు తిరిగి వచ్చి ఒక వాస్తవ ఒప్పందం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలా జరగాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఇంకా ఆ సమయం రాలేదు..’’ అని వ్యాఖ్యానించారు.