
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక తొలిసారిగా శ్వేతసౌధంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. బుధవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో పలు ముస్లిం దేశాల దౌత్యవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. భవిష్యత్‌లో ప్రజలందరి భద్రత, శ్రేయస్సు కోసం ముస్లిం సమాజం నుంచి సహాయ సహకారాలు కావాలని ఆకాంక్షించారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక తన తొలి విదేశీ పర్యటన సౌదీ అరేబియాలో జరిగిందని గుర్తుచేశారు.
బిల్ క్లింటన్ హయాం నుంచీ…
శ్వేతసౌధంలో ఇఫ్తార్ విందును ఇవ్వడం 1990లలో బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి సంప్రదాయంగా వస్తోంది. గత ఏడాది రంజాన్ సమయానికే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. అయినా గత ఏడాది ఆయన ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయలేదు. అంతేకాకుండా, పలు ముస్లిం దేశాలపై ఆంక్షలు సైతం విధించారు. దీంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమైంది.
అనూహ్యంగా ట్రంప్…
మరోవైపు ట్రంప్ అవలంభిస్తోన్న విధానాలను నిరసిస్తూ పలు ముస్లిం పౌర హక్కుల సంస్థలు శ్వేతసౌధం సమీపంలోనే ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశాయి. అయితే ఈసారి ఎవరూ ఊహించని విధంగా ట్రంప్ తన తొలి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు ప్రధాన ముస్లిం దేశాల ప్రతినిధులు పలువురు హాజరవగా, సౌదీ రాయబారి ప్రిన్స్ ఖలీద్ బెన్ సాల్మన్, జోర్డాన్ రాయబారి దినకవర్, ఇండోనేషియా రాయబారితో కలసి ఒకే టేబుల్ వద్ద ట్రంప్ కూర్చుని విందు ఆరగించారు.








