24.2 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం పాకిస్తాన్‌లో ఘోరం.. జనావాస ప్రాంతంలో కుప్పకూలిన విమానం, 100 మంది దుర్మరణం…

పాకిస్తాన్‌లో ఘోరం.. జనావాస ప్రాంతంలో కుప్పకూలిన విమానం, 100 మంది దుర్మరణం…

pakistan-plane-crash-near-karachi-international-airport
- Advertisement -

కరాచీ: పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో మరికాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. 

దీంతో విమానం రెక్కలు తెగిన పక్షిలా ఊగిసలాడుతూ వచ్చి జనావాస ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ప్రయాణికుల ఆర్తనాదాలు, కేకలు గాల్లో కలిసిపోయాయి.

క్షణాల్లో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ.. చెల్లాచెదురైన విమాన శకలాలతో  మరుభూమిలా మారిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. 

ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల్లో 31 మంది మహిళలు, 9 మంది చిన్నారులు ఉన్నారు.

లాహోర్‌ నుంచి బయలుదేరిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పీకే-8303 విమానం కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవాల్సి ఉంది. 

అయితే దురదృష్టవశాత్తు ల్యాండింగ్‌కు ఒక్క నిమిషం ముందు ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న జిన్నా హౌసింగ్ సొసైటీపై కూలిపోయింది. 

కూలిపోవడానికి ముందు విమానం ఒక మొబైల్ టవర్‌ను ఢీకొందని, దాని రెక్కల భాగం నుంచి మంటలు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు కొందరు పేర్కొన్నారు. 

మరోవైపు జనావాస ప్రాంతంలో విమానం కూలిపోవడంతో ఆ ప్రాంతంలో ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. విమాన శకలాల ధాటి, తాకిడికి కనీసం 25 ఇళ్లు, పలు కార్లు దెబ్బతిన్నాయి. 

ప్రయాణికుల్లో ముగ్గురు తప్ప అందరూ మరణించి ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు దెబ్బ తిన్న ఇళ్లలో కూడా 25 నుంచి 30 మంది వరకు క్షతగాత్రులైనట్లు చెబుతున్నారు. 

ఆ ముగ్గురూ.. మృత్యుంజయులే!

కరోనా లాక్‌డౌన్ అనంతరం గత శనివారం నుంచే పాకిస్తాన్‌లో దేశీయ విమాన సర్వీసులు పరిమిత సంఖ్యలో ప్రారంభమయ్యాయి. అంతలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

ఈ విమాన ప్రమాదం నుంచి ముగ్గురు ప్రయాణికులు బతికి బయటపడ్డారు. వీరిలో అక్కడి బ్యాంక్ ఆఫ్ పంజాబ్ ప్రెసిడెంట్ జాఫర్ మసూద్ కూడా ఉన్నారు. 

సాంకేతిక లోపాలే కారణమా?

విమాన ప్రమాదానికి నిర్దుష్టమైన కారణాలేమీ ఇంకా తేలలేదని, విమానంలో సాంకేతిక సమస్యలు ఏర్పడినట్లు పైలట్.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు తెలిపారని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అర్షద్ మాలిక్ తెలిపారు.

మధ్యాహ్నం 2.37 గంటల ప్రాంతంలో.. మరికాసేపట్లో విమానం కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అవబోతున్న సమయంలో విమాన చక్రాల వ్యవస్థ(ల్యాండింగ్ గేర్)కు సంబంధించి సమస్య ఏర్పడినట్లు విమాన పైలట్ కెప్టెన్ సజ్జాద్ గుల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)కి తెలిపినట్లు మరో అధికారి చెప్పారు. ఆ తరువాత కాసేపటికే విమానం రాడార్ స్క్రీన్‌పై నుంచి అదృశ్యమైనట్లు పేర్కొన్నారు.

అదే చిట్టచివరి సంభాషణ…

విమాన ప్రమాదానికి ముందు పైలట్‌కు.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు మధ్య జరిగిన సంభాషణను సంపాదించినట్లు పాక్ వార్తా ఛానల్ ఒకటి పేర్కొంది. 

దాని ప్రకారం.. ల్యాండింగ్‌కి ముందు విమాన చక్రాల వ్యవస్థకు సంబంధించి సమస్య ఏర్పడినట్లు పైలట్ కెప్టెన్ సజ్జాద్ గుల్ ఎయిర్‌ ట్రాఫిక్ కంట్రోల్‌కు తెలిపాడు. 

తరువాత కాసేపటికే విమానానికి సంబంధించి రెండు ఇంజిన్లు కూడా విఫలమైనట్లు చెప్పాడు. అనంతరం కొద్ది సెకన్లకే ప్రమాద సంకేతాన్ని సూచిస్తూ.. పైలట్.. ‘మేడే.. మేడే.. మేడే’ అని అరిచారు. ఆ తరువాత విమానం కూలిపోయింది.

 

 

- Advertisement -