
హైదరాబాద్: ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, నటుడు హరి కిషన్(57) కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.
మిమిక్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం లిఖించుకున్న హరికిషన్ మృతి తెలుగు వారికి తీరని విషాదాన్ని మిగిల్చింది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
పాత తరం సినీనటులు ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణలతోపాటు ఈ తరం హీరోలు పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు.. ఇలా పలువురు హీరోల గొంతులను హరికిషన్ ఎంతో అద్భుతంగా అనుకరించేవారు.
ఒక్క సినిమా హీరోలే కాదు, నాటి.. నేటి రాజకీయ నాయకుల గొంతులని కూడా అనుకరించడంలో ఆయన దిట్ట.
హరికిషన్.. 1963 మే 30న ఏలూరులో జన్మించారు. ఎనిమిదేళ్ల వయసులోనే తన గురువులను, తన తోటి వారి గొంతులను అనుకరించడం ప్రారంభించారాయన.
ఆయన ధ్వన్యనుకరణ శక్తికి ఎంతో మంది ముగ్ధులయ్యేవారు. పలువురు సెలబ్రిటీలు కూడా ఆయనలోని టాలెంట్‌కి ఫిదా అయ్యారు.
హరికిషన్ కేవలం వ్యక్తుల గొంతుకలు మాత్రమే కాదు, పశు పక్ష్యాదుల శబ్ధాలతో పాటు యంత్రాలు చేసే శబ్ధాలు.. సంగీత వాద్య పరికరాల శబ్దాలను కూడా తన గొంతులో పలికించేవారు.
దేశ విదేశాలలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన హరికిషన్.. ప్రముఖ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డికి గురువు కూడా.








