అద్భుతం: ఏడు నెలలు ప్రయాణించి.. అంగారకుడిపై విజయవంతంగా దిగిన నాసా ‘ఇన్‌సైట్’…

nasa-mars-insight-lander-1
- Advertisement -

వాషింగ్టన్: అంతరిక్ష పరిశోధనల్లో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ అంగారకుడి గుట్టుమట్లు తెలుసుకునేందుకు పంపిన ‘ఇన్‌సైట్’ ప్రోబ్‌ను సోమవారం విజయవంతంగా అంగారక గ్రహం ఉపరితలంపై దింపింది. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు (ఇండియాలో అర్థరాత్రి 1.30 గంటలకు.. తెల్లవారితే నవంబరు 27) ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ ఇన్‌సైట్ ప్రోబ్ అంగారకుడిపైకి దిగింది.

చదవండి: ఇక మండే సూర్యుడే టార్గెట్: ‘నాసా’ ప్రతిష్టాత్మక ప్రయోగం.. ‘పార్కర్ సోలార్ ప్రోబ్’

అంగారకుడిపై ప్రకంపనల తీవ్రతలను, అక్కడి భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేయడానికి ‘నాసా’ ఈ ఏడాది మే, 5న ఈ ఇన్‌సైట్ ల్యాండర్‌ను స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా అంగారకుడి వైపు ప్రయోగించింది. అంతరిక్షంలో సుమారు ఏడు నెలల పాటు మొత్తం 300 మిలియన్ మైళ్ల దూరం ప్రయాణం సాగించిన ఈ ల్యాండర్ ఎట్టకేలకు అంగారక గ్రహం ఉపరితలంపై విజయవంతంగా దిగింది.


తొలి ఫోటోను తీసి పంపిన ఇన్‌సైట్…

అంతేకాదు, దిగిన వెంటనే అంగారకుడి పైనుంచి తొలి ఫోటోను తీసి పంపింది. ఇన్‌సైట్ ల్యాండర్ తీసిన ఈ చిత్రాన్ని నాసా విడుదల చేసింది. అంగారకుడిపై దిగిన వెంటనే ఇన్‌సైట్ ప్రోబ్‌కు అమర్చిన ఏడడుగుల సోలార్ రెక్కలు సురక్షితంగా తెరుచుకున్నాయి. దీంతో దానికి అమర్చిన బ్యాటరీలు కూడా రీచార్జ్ అవడం ప్రారంభించాయి.

‘ఇన్‌సైట్’ రోబోటిక్ ప్రోబ్ అంగారక గ్రహంపై లోతైన పరిశోధనలు చేయనుంది. ఆ గ్రహం అంతర నిర్మాణం, దాని భ్రమణాన్ని తెలుసుకునేందుకు రేడియో సైన్స్ ప్రయోగాలు కూడా చేస్తుంది. అక్కడి వాతావరణం ఇతరత్ర అంశాలను ఇది అధ్యయనం చేస్తుంది. ఇది రోబో సహాయంతో పనిచేస్తుంది. అంగారకుడిపై సెస్మోమీటర్, బరోతో పాటు మరో హీట్ ప్రోబ్‌ను ఉంచుతుంది.

రెండేళ్ల పాటు అంగారకుడి ఉపరితలంపై…

అయితే రెండేళ్ల పాటు అంగారకుడి ఉపరితలంపై ఉండనున్న ‘ఇన్‌సైట్’ ప్రోబ్ ఇప్పటికిప్పుడే పరిశోధనలు ప్రారంభించదు. రెండు నుంచి మూడు నెలల సమయం తీసుకుంటుంది. అవసరమైన పరికరాలను ఆ గ్రహ ఉపరితలంపై దించేందుకు రోబో ఈ సమయం తీసుకుంటుంది. ఈలోపు అక్కడి వాతావరణాన్ని పరిశీలిస్తూ.. ఫొటోలను తీసి భూమిపైకి చేరవేస్తూ ఉంటుంది.

భవిష్యత్తులో చంద్రుడిపైకి, అంగారకుడిపైకి మానవ సహిత యాత్రలు చేయాలని భావిస్తోన్న ‘నాసా’కు ప్రస్తుతం అంగారక గ్రహంపై దిగిన ‘ఇన్‌సైట్’ నుంచి వచ్చే సమాచారం ఎంతగానో ఉపయోగపడనుంది.

మానవ చరిత్రలో ఇది ఎనిమిదోసారి…

అంగారకుడిపై ఇన్‌సైట్ ప్రోబ్ క్షేమంగా, విజయవంతంగా దిగిన సందర్భంగా.. నాసా పరిపాలనాధికారి జిమ్ బ్రిడెన్స్‌టైన్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు విజయవంతంగా అంగారకుడిపై ల్యాండ్ అయ్యాం.. మానవ చరిత్రలో ఇది ఎనిమిదోసారి.. ప్రయోగం విజయవంతం కావడంపై అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఫోన్ చేసి తన అభినందనలు తెలియజేశారు..’’ అని తెలిపారు.

‘నాసా’కు మరో విభాగానికి చెందిన అధికారి లోరీ గ్లేజ్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు అంటే 1965 నుంచి జరుగుతున్న ప్రయోగాల్లో కేవలం అంగారకుడిని కక్ష్య నుంచి, దాని పరిసరాల్లో వాతావరణం, భూగర్భ శాస్త్రం, ఉపరితల కెమెస్ట్రీని మాత్రమే అధ్యయనం చేయగలిగాం.. ఇప్పుడు ఏకంగా అంగారక గ్రహంపైనే దిగడం ద్వారా ఆ గ్రహంపైన ప్రతి అంశాన్ని లోతుగా పరిశోధించే వీలు కలుగుతుంది..’’ అని పేర్కొన్నారు.

- Advertisement -