కర్నూలు: ప్రతి శివరాత్రి నాడు నోట్లోంచి శివలింగాలు తీసి తన భక్తులకు ప్రసాదిస్తూ పేరు తెచ్చుకున్న బాలసాయి బాబా మంగళవారం ఉదయం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. పద్దెనిమిదేళ్ల వయసులోనే బాలసాయి బాబాగా పేరుగడించి కర్నూలు ప్రాంతంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి వేలాది మంది భక్తులకు ఆయన ఇలవేల్పుగా మారారు. బాల సాయిబాబా హఠాన్మరణం ఆయన భక్తులను తీవ్ర ఆవేదనలో ముంచెత్తింది.
1960 జనవరి 14న కర్నూలులో జన్మించిన బాలసాయి, చిన్నతనం నుంచే శ్రీ రమణ మహర్షి బోధనలతో ఆథ్యాత్మికత వైపు మళ్లినట్టు చెబుతుంటారు. మెడిసిన్, ఫిలాసఫీ విద్యలు అభ్యసించిన ఆయనకు నృత్య, గాత్ర కళల్లోనూ ప్రావీణ్యం ఉంది. తన 18వ ఏటనే ఆశ్రమాన్ని స్థాపించిన బాలసాయి బోధనల పట్ల ఎంతో మంది ఆకర్షితులయ్యారు.
తన ఆశ్రమానికి విచ్చేసే భక్తులకు గాల్లోంచి చిన్న చిన్న బంగారు ఆభరణాలను తీసి ఇవ్వడం, చేతి నుంచి విభూది రాల్చడం, శివరాత్రి నాడు తన నోటి నుంచి చిన్న చిన్న శివలింగాలను బయటకు తీసి పంచడం వంటి పనులతో బాలసాయి బాబా తన భక్తులను ఆకట్టుకునేవారు.
ఎన్నో సేవా కార్యక్రమాలు…
బాలసాయి బాబా తన ట్రస్టు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. కర్నూలు ప్రాంతంలో పాఠశాలలు, రహదారులు వంటి మౌలిక వసతులు కల్పించడంలో తన ట్రస్టు నుంచి కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు. అంతేకాదు, రాయ్‌పూర్‌లోని కళింగ యూనివర్శిటీకి బాలసాయి వైస్ చాన్స్ లర్‌గానూ విధులు నిర్వర్తించారు.
ఆయన సేవలకు మెచ్చి.. డాక్టర్ ఆఫ్ డివైనిటీ (ఇటలీలోని గ్లోబల్ ఓపెన్ యూనివర్శిటీ), అంబాసిడర్ ఆఫ్ పీస్ (ఐరాస), ఆననరీ డిగ్రీ ఆఫ్ డాక్టర్ ఆఫ్ లాస్ (నెదర్లాండ్స్ గ్లోబల్ పీస్ వర్శిటీ), ఆనరరీ డిగ్రీ ఆఫ్ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (ఫ్రాన్స్, యూనివర్శిటీ ఆఫ్ లిబ్రీ డెస్ సైన్స్) గౌరవాలు దక్కాయి.
వివాదాలకూ తక్కువేం లేదు…
బాలసాయి బాబా ఎంతటి ఆధ్యాత్మికవేత్తో, అన్ని వివాదాలూ ఆయన్ను చుట్టుముట్టాయి. అనంతపురంలో గుప్త నిధులను దక్కించుకున్నారన్నది ఆయనపై వచ్చిన తొలి ఆరోపణ.. ఆ డబ్బుతోనే ఆయన ఆశ్రమాలు స్థాపించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. పలువురి స్థలాలను కూడా ఆయన కబ్జా చేశారనే ఆరోపణలూ లేకపోలేదు. ఈ వివాదాలకు సంబంధించి ఆయనపై పలు కేసులు విచారణ దశలో ఉన్నాయి.
అయితే బాలసాయి బాబాపై ఎన్ని ఆరోపణలు ఉన్నా.. ఆయన ఎన్ని వివాదాల్లో చిక్కుకున్నా.. ఆయన హఠాన్మరణంపై పలువురు దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వెలిబుచ్చారు.