గాజాలో భారీ హింస.. 52 మంది మృతి, 2,400 మందికి గాయాలు

- Advertisement -

జెరూసలెం: జెరూసలెంలో అమెరికా రాయబార కార్యాలయం ప్రారంభాన్ని వ్యతిరేకిస్తూ పాలస్తీయులు జరిపిన నిరసన ప్రదర్శనలు రక్తసిక్తమయ్యాయి. సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన వేలాది మందిపై ఇజ్రాయెల్‌ బలగాలు జరిపిన కాల్పుల్లో 52 మంది ప్రాణాలు కోల్పోయారు.

తీవ్ర ఉద్రిక్తతలు, భారీ హింసాత్మక ఘటనల మధ్య ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని టెల్‌ అవీవ్‌ నుంచి జెరూసలెంకు మార్చారు. ఈ సందర్భంగా పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో పెద్ద ఎత్తున హింస చోటుచేసుకుంది.

2014లో ఇజ్రాయెల్‌–పాలస్తీనాల మధ్య గాజా యుద్ధం అనంతరం ఈ స్థాయిలో హింస చోటు చేసుకోవడం ఇదే ప్రథమం. 2,400 మంది గాయపడ్డారని పాలస్తీనాకు చెందిన హమాస్‌ తెలిపింది. ఇజ్రాయెల్‌ భయంకరమైన మారణహోమానికి పాల్పడిందని పాలస్తీనా అధ్యక్షుడు మహమద్‌ అబ్బాస్‌ ఆరోపించారు. సరిహద్దుల్లోని కంచెను దాటేందుకు పాలస్తీనా ఆందోళనకారులు టైర్లను తగలబెట్టి, సైనికులపై రాళ్ల వర్షం కురిపించారు.

ఈ హింసకు హమాస్‌దే బాధ్యతని, ఇజ్రాయెల్‌ భూభాగంలోకి చొరబడేలా ఆందోళనకారుల్ని రెచ్చగొడుతోందని ఆ దేశ భద్రతా బలగాలు ఆరోపించాయి. ఇజ్రాయెల్‌లో రాయబార కార్యాలయాన్ని మారుస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత డిసెంబర్‌లోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ మేరకు సోమవారం జెరూసలెంలో యూఎస్‌ ఎంబసీ అధికారికంగా ప్రారంభమైంది.

- Advertisement -