ఘోరం: ఇథియోపియాలో హైదరాబాదీ వ్యాపారి సజీవదహనం, మరో నలుగురు కూడా…

Hyderabad Latest News, businessman dead in their car in Ethiopia News, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: ఇథియోపియా దేశంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ హైదరాబాద్ వ్యాపారి మృతి చెందాడు. రాగి గనుల వ్యాపారం నిమిత్తం ఆ దేశానికి వెళ్లిన హైదరాబాద్‌వాసి పీవీ శశిధర్‌.. ఆగంతకులు కాల్పులు జరిపి, నిప్పుపెట్టడంతో కారులోనే సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో ఆయనతోపాటు మరో ఐదుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు.

మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. శశిధర్‌ చాలాకాలంగా బాలానగర్‌ సమీపంలో పంటల ఉత్పత్తులు, ఇతర వస్తువులు నిల్వ చేసేందుకు శీతల గిడ్డంగి నిర్వహిస్తున్నారు. దీంతోపాటు 25 ఏళ్లుగా అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో సీ-ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వ్యాపారం చేస్తున్నారు.

రాగి గనుల వ్యాపారం చేసేందుకు ఇథియోపియాకు..

రాగి గనుల వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో కొంతకాలంగా ఇథియోపియా వెళ్లివస్తున్నారు. ఆ దేశ ఖనిజాభివృద్ధి సంస్థతో రాగి లభించే భూముల లీజు ఒప్పందం, ప్రభుత్వ అనుమతులు వంటి పనులు దాదాపు ముగిశాయి. మార్చి 19న అక్కడి రాగి గనుల క్షేత్ర పరిశీలనకు రెండు కార్లలో పదిమంది బయల్దేరారు. ముందు కారులో ఐదుగురు ఉన్నారు.

వెనుక కారులో శశిధర్‌తోపాటు ఒక జపాన్‌ మహిళ, ముగ్గురు ఇథియోపియన్లు ఉన్నారు. శశిధర్‌ ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి నిప్పుపెట్టడంతో కారుతో సహా అందులో ఉన్న ఐదుగురు సజీవదహనమయ్యారు. ముందు వెళ్లిన కారులో ఉన్నవారు వెనుక కారు రావడం లేదని వెనక్కు వచ్చి చూడగా కాలిపోతున్న కారు కనిపించింది. వారు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.

ఈ మేరకు ఇథియోపియా దినపత్రికలో ప్రచురితమైనట్లు శశిధర్ బంధువు సంతోష్‌ తెలిపారు. శశిధర్‌ భార్య లలిత గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నందున ఆమెకు విషయం తెలియనివ్వకుండా కుటుంబసభ్యులు జాగ్రత్తపడుతున్నారు. మృతదేహాన్ని తెప్పించేందుకు భారతీయ రాయబార కార్యాలయం సహకారం కోరుతున్నారు. శశిధర్ మరణవార్త తెలియడంతో అశోక్‌నగర్‌లోని ఆయన నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

- Advertisement -