ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధానికి కరోనా సోకడం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. పాకీస్తాన్ మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీకి కరోనా సోకినట్లు ఆయన కుమారుడు ఖాసిం గిలానీ తెలిపారు.
ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిన ఖాసిం ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను, న్యాబ్(నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో)లే దీనికి కారణమని ఆరోపించారు.
‘’మా నాన్నను కరోనా బారిన పడేసి ఆయన ప్రాణాపాయ స్థితిలోకి నెట్టినందుకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు, న్యాబ్‌కు కృతజ్ఞతలు..’’ అంటూ ఖాసీం గిలానీ ట్వీటర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవినీతి అరోపణలకు సంబంధించి యూసుఫ్ గిలానీ ఇటీవల న్యాబ్ ముందు హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరడం కూడా జరిగింది.
గిలానీతో పాటు మరికొందరు రాజకీయ నాయకులకు కూడా ఇటీవల కరోనా పాజిటివ్ తేలినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే పాకిస్తాన్‌లో ఇప్పటివరకు 1,34,667 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ఈ మహమ్మారి కారణంగా 2,574 మంది మృత్యువాత పడినట్లు సమాచారం.